పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

వరాహపురాణము


బొనర్చువారును, బ్రతప్తలోహస్తంభంబులం గట్టఁబడి కమలినదేహంబులం బొడమిన
దాహంబులం బరవశులై వగచువారును, మెడల నురులు దవిలించి వ్రేలం దివిచిన వాయు
నిరోధంబున నయనంబులు వెలికి నుఱికి తూఁగియాడెడువారును, గ్రాఁగిన లోహద్రవంబులు
వాతెఱలం బూరెంచిన నంతర్దాహంబున హాహాకారంబు లొనర్చువారును, గళలగ్నంబులైన
గాలంబులతోడం ద్రిప్పినఁ దద్భ్రమణవేగంబునం దెగి కూలువారును, లోహముఖంబులు
గల పులుఁగులు కన్ను లవియం బొడిచిన నంధులై కూపంబులం బడువారును, సంఘాతకాల
సూత్రాదినరకంబులందు బాధితు లగువారునునై యాతనాదేహం బవలంబించి, పాపఫలం
బనుభవించి, కుందు ప్రాణులచేత బీభత్సాకరంబైన యమమందిరంబుఁ గనుంగొని, శివశర్మ
పార్శ్వస్థితుండగు యమదూత కిట్లనియె.

57


క.

ఇది యేలోకం? బెవ్వని | సదనం? బీప్రాణు లిట్లు సంతతదుఃఖా
స్పదు లగుటకుఁ గత మెయ్యది? | సదయత నీమాయ దెలుపు సర్వము పుత్రా!

58


వ.

అనిన భూసురోత్తమునకు శీలుం డిట్లనియె.

59


సీ.

మున్నూఱుయోజనంబులు లోనివిస్తృతం | బార్నూఱుక్రోశంబు లాయతంబు
నై మించు నిచ్చోటు యమలోక, మిందును | జీవులు మును ధాత్రిఁ జేసినట్టి
పాతకరాసులఫలముల నీరీతి | యాతనాసహితులై యనుభవించి,
పాపానురూపరూపములతో మేదినీ | స్థలమున వెండియు సంభవించి,


తే.

పుత్రమిత్రకళత్రాదిభూరిమోహ | సహితు లగుచు ననేకదోషము లొనర్చి,
కాలవశమున గాత్ర[1]సంగములు విడిచి, | తిరుగ నీలోకమున కేఁగుదెంతు రనఘ!

60


తే.

పుణ్యపాపఫలంబు లీపురవరమున | ననుభవింపంగఁ గూడిన యపుడు, విప్ర!
ధారుణీనాయకుండు నంత్యజుఁడు నొక్క | సమమ, యధికాల్పభావలేశమును లేదు.

61


సీ.

కాఁగిన యినుము వక్త్రమునఁ బోసినఁ దిను | వారలు వాగ్వ్యభిచారపరులు,
మండెడు నుక్కుకంబములఁ బీడించిన ! వారు సంతతపరదారరతులు,
తప్తతైలద్రవాంతరముల వర్తించు | వా రన్యసంతాపవత్సలాత్ము,
లురులు పెట్టిన మెడ లూఁచిపోవఁగ వ్రేలు | వారు [2]జారాంగనావ్యసనమతులు


తే.

భీకరానలశిఖలలో వ్రేలువారు | శిష్టజనతాపకరులగు దుష్ట[3]జనులు,
తనువు లవియంగ నసిపత్రవనములందుఁ | బొక్కిపడువారు బొంకులపుట్ట లనఘ!

62
  1. సంఘములు - మ, తా,హ,ర,క
  2. రాజాంగనా - మా,త; పరాంగనా - తి, తీ
  3. మతులు - మ,హ,క