పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

157

శివశర్మ నరకలోకసందర్శనము

క.

[1]ఈతెరువు శమనపురికిని | నీతెరువు సురేంద్రపురికి నేఁగును భువన
ఖ్యాత గతి నిందులో నీ | కేతెరువు రుచించు నంద యేఁగుద మనఘా!

54


క.

అని శీలుఁ డిట్లు పల్కిన | విని విప్రుఁడు నరకలోకవీక్షా[2]పేక్షన్
మును శమనపురికి నరుగుద | మని, శీలుఁడుఁ దానుఁ జనుచు నటఁ గట్టెదురన్.

55


సీ.

దావాగ్ని బహుశిఖాతప్తులై వాతెరల్ | దడుపుచు నోళ్లెండి పడినవారు,
దారుణకింకరోత్కరతాడితాంగులై | మొఱలువెట్టుచు నేలఁ బొరలువారు,
నిటువంటి పాపంబు లేల చేసితి మని | కుందుచుఁ దముఁ దిట్టుకొనెడువారు,
మృదుపాదములు గాఁడి మీఁగాళ్ళు వెడలిన | వాఁడిముండ్లను [3]నొచ్చి వణఁకువారు


తే.

నగుచుఁ, దెరువున యాతనాప్రాప్తులైన | విప్రహంతల, దేవతావిత్తహరులఁ,
బరవధూసంగసహితులఁ, బాప[4]రతుల | నద్భుతంబునఁ గనుఁగొంచు నరిగి యరిగి.

56


వ.

అట ముందట, శస్త్రధారావిదారితంబులగు దుర్జనజిహ్వాఖండంబులవలనను,
నిస్త్రింశదళితంబులగు వేదబాహ్యజనగళంబులవలనను, శూలప్రోతంబు లగు గురునిందక
వక్షస్స్థలంబులవలనను, గదాఘాతశకలితంబులగు విప్రదూషకమస్తకంబులవలనను,
నిర్గళితంబులగు రక్తమాంసమేదోమజ్జాదులచేతం బంకిలంబై, తత్పూతిగంధంబునకు
ననుబంధంబులతో గములుగట్టి, [5]జుంజుమ్మన మూఁగి పరిభ్రమించు మక్షికాకులంబుచేత
సంకులంబై, తదుద్భూతంబులగు క్రిమిసంఘాతంబులు తొలఁగం జెదరిపడిన కండల నండ
గొనిన కాకంబులఁ దిననీక తఱుము లోహచంచుఖగంబులచేత భీకరంబై, సింహకిశోరంబుల
లీలం బొలుచు శునకసహస్రంబులు గఱచిన విడిపించుకొననేరక మొఱలుపెట్టువారును, శూల
నిక్షిప్తాఁగులై దురంతవేదనాభరంబున నొఱలువారును, దప్తతైలమధ్యంబునం దేలియాడుచుఁ
బొదపొదం బొక్కువారును, నసిపత్రవనంబులం గూలంద్రోచిన శకలితశరీరులై పరివేదనం

  1. ఈతెరువు సురేంద్రపురి | ప్రీతి జను న్నది చూడఁగఁ బ్రేతవీటికిం - మ; ఈతెరువు శమనువీటికి | నీ తెరువు సురేంద్రపురికి నేఁగును భువన - మా; ఈతెరువు సురేంద్రపురికి | నీతెరువు కృతాంతనగరి కేఁగును భువన - త; ఈతెరువు ప్రేతపతిపురి | కీ తెరువు సురేంద్రపురికి నేఁగును భువన - తా; ఈతెరువు శమనపురమున |కీతెరువు త్రిలోకపాలుఁ డింద్రునిపురికౌ - తి, తీ; హ,ర ప్ర.లో ఈ భాగము లుప్తము.
  2. పరుడై - తా
  3. నెంచి - మ,క
  4. రతులునైనవారిని గను - తి, తీ
  5. జోమన - అన్ని ప్ర.