పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

155


మ.

అకలంకుం డతఁ డిట్లు చన్న, శివశర్మాఖ్యద్విజుం డౌర్ధ్వదై
హికముల్ వానికి, దీర్చి, యాత్మసతితో నింతింత[1]నారాని మ
చ్చిక దుఃఖింపుచునుండె, నంతటను నాశీలుండు భూదేవగే
హకృతాహారపవిత్రభోజనభవం బైనట్టి పుణ్యంబునన్.

40


చ.

అనుపమదివ్య దేహధరుఁడై వరపుష్పక మెక్కి, నిర్జరీ
జనములు గొల్వఁగా, నమరసద్మము చొచ్చిన, వాని భానుమ
త్తనయుఁడు గాంచి, తత్పతిహితత్వగుణంబున కుత్సహించి, యా
యనఘుని, నాత్మకింకరనియామకుఁగా నధికారిఁ జేసినన్.

41


క.

అతఁడును దాని కొడంబడి | ప్రతిదినమును శమనకింకరవ్రాతముతో
క్షితికిం జని భౌతికతను | గతులగు ప్రాణులను విలయకాలజ్ఞుండై.

42


చ.

కొని చనుచుండి యుండి, యొకకొన్ని[2]దినంబులు చన్నమీఁద, నా
జననుతుఁ డొక్కనాఁడు శివశర్మఁ గనుంగొని, [3]చేరఁబోయి వం
దన మొనరించి, శీలుఁడను నామము చెప్పిన, వానిఁ జూచి యా
ఘనుఁడు ప్రమోదమొంది, నునుఁగౌఁగిట జేర్చి, మృదూక్తి నిట్లనున్.

43


ఉ.

[4]‘ఎచ్చటనున్న వాఁడ విటు లిన్నిదినంబులు? నిన్నుఁగూడి యా
వచ్చినవార లెవ్వ? రనివారితదివ్యశరీర మేఘనుం
డిచ్చెను? నిన్ను భృత్యునిగ నేలిన దేవవరేణ్యుఁ డెవ్వఁ? డీ
యచ్చెరు వంతయుం దెలుపు మాత్మజ! నాయెడ భక్తి గల్గినన్'.

44


వ.

అని పలికిన శివశర్మకు శీలుం డిట్లనియె.

45


సీ.

భూసురోత్తమ! నీవు పుణ్యాధికుండవు | సత్యసంధుండవు సర్వసముఁడ
వగుట, నీగేహంబునందుఁ బతివ్రతా | రత్నంబు భవదీయరాజవదన,
ననుఁ బుక్రవాత్సల్యమున నియోగింపుచు | [5]ననువాసరంబు నిష్టాన్న మొసఁగ
భుజియించుకతన నేఁ బుణ్యుండనై యుండ, | నంత, నీపుత్రిక యధికరోష

  1. నాఁగాని - తా
  2. సమంబులు - త
  3. భక్తితోడ నా
    తనికి నమస్కరించి వసుధాదివిజోత్తమ యేను నీదునం
    దనుఁడను శీలనాముఁడ మనంబున నన్ను నెఱింగితే యనన్ - తా
  4. అచ్చెరువంది విప్రవరుఁ డాతనిఁ గన్గొని నిన్నుఁగూడి యా
    వచ్చిన - తా
  5. ననుఁదాసతంబు - మా,త