పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

153


ఉ.

నావుడు, భూసురాంగన మనంబున శోకము నొంది 'యక్కటా!
దైవ మనేకకాలము వ్రతంబులు [1]బాసగ నీయఁబోయి, నా
కీ వర మెట్లొసంగెఁ? బతిహీనత నొందిన బిడ్డఁ జూచి, నా
జీవము నిల్చునే?' యనుచుఁ జింతిలి, పొక్కుచు నుండు నంతటన్.

26


క.

భూసురవరుఁ డాకన్యకు | వాసవి యని పేరు పెట్టి వావిరి పెనుపం
గా, సప్తవత్సరంబులు | భాసురగతి నరుగఁ, బెండ్లిప్రాయం బైనన్.

27


చ.

[2]వరుఁ గొనివచ్చి, పుత్రిని వివాహము చేసెద నంచు భూసురుం
డరయుచు . బ్రహ్మతీర్థతటమందు విహారపురంబు చేరి, కే
సరుఁ డను విప్రనందను, రసజ్ఞు, నధీతసమస్తవేదు, న
ప్పురమునఁ గాంచి, [3]పిల్చుకొని పోయి, నిజాత్మజఁ బెండ్లి చేసినన్.

28


తే.

కనినవా రెట్లు బ్రదికిరో మునివరేణ్య! | విన్నవింపంగ నోరాడకున్న దిపుడు;
వాసవీభర్త దారుణజ్వరము దాఁకి | తనువుతోఁ బా సె నేడవదినమునందు.

29


క.

అతఁ డిట్లు శమనమందిర | గతుఁడగుటయుఁ, బారలౌకికంబులు శాస్త్రో
[4]చితసరణిఁ దీర్చి, భూసుర | పతి సతియును [5]దాను వగల పాలై రనఘా!

30


ఉ.

భవ్య[6]నివాసహేతువగు ప్రాయ మొకించుక యంకురింప, భో
గవ్యవహారయోగ్యమగు [7]కాలమునంద యనుంగుబిడ్డ వై
ధవ్యము నొందెనేనిఁ దలిదండ్రులయేటికి, దానిఁ గన్నచో
నవ్యయదుఃఖసాగరమునందు మునుంగరె వీత[8]రాగులున్?

31


తే.

ఇట్లు పతిహీనయైన యాయిగురుఁ[9]బోణి | కబ్దములు కొన్ని చన్నఁ, బ్రాయంబు వొడమె;
రసము చవిగొను రాజకీరంబు లేని | చూతలతికకు సఫలతాఖ్యాతివోలె.

32

శీలుని యుత్తమశీలము

ఉ.

వాసవి యట్లు యౌవనభవంబగు దర్పముఁ జెంది యిక్షుబా
ణాసనబాణభిన్నహృదయాంబుజయై, ధృతి నిల్పలేక, కే
ళీసుఖకాంక్షఁ దన్నుఁ గదలింపఁగ, శీలునియింటికిం దమి
స్రాసమయంబునందు నభిసారికయై రయమార నేఁగినన్.

33
  1. సేయఁగ - తి
  2. వరున కొసంగి - తి, తీ
  3. తోడుకొని - తి, తీ
  4. దిత - తా
  5. దారు - హ
  6. వివాద - తా
  7. నాలము (యతి?) - మ,త,ర
  8. రాగతన్ - హ
  9. బోఁడి - త,హ,ర; బోడి - తా