పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

వరాహపురాణము


చ.

ప్రియనవపత్రసాంద్రమగు పిప్పలభూజముక్రింద, వాలుకా
శయనమునందు, నప్పు డటు సంభవమొందిన పిన్నపాపనిన్
[1]బయలునఁ గాంచి, యాతఁ డనపత్యుఁడు గావున, భక్తితోఁ గర
ద్వయమున నెత్తి తెచ్చి, నిజధామముఁ జేర్చి, దయార్ద్రచిత్తుఁడై.

20


క.

శీలుండని పేరిడి, యా | బాలకునిం దాది పెట్టి పరిపోషింపం,
గాలక్రమమున నతనికి | నాలో యౌవనము వొడమ, నట విప్రుండున్.

21


వ.

అక్కుమారుని జాతి నిర్ణయింప లేమింజేసి, కృషి[2]పాశుపాల్యంబులయందు నియుక్తునిం
జేసిన, నతండును దత్కర్మంబుల నప్రమత్తుండై వర్తింపుచుఁ, దన్మందిరంబులు ధనధాన్య
[3]పూరితములుగా నొనరింపుచు, నా విప్రదంపతులయెడఁ బితృబుద్ధి గావింపుచు , జౌర్య
మాయాదిరహితుండై, నిర్మలభక్తియుతుండై, పనులయందు సావధానుండై, తద్గృహంబునఁ
బ్రవర్ధమానుండయ్యె. తద్భూసురాంగనయు నతనియందుఁ బుత్రస్నేహం బంగీకరించి,
మృష్టాన్నంబులం బరితృప్తి యొనర్చుచునుండె. ఇట్లు కొన్నిసంవత్సరంబు లరుగునంత.

22


చ.

సతతము నామహీవిబుధసాధ్వి, కుమారులు లేక , దారుణ
వ్రతములు, దేవపూజ లుపవాసములున్, బహుదానధర్మముల్
హితమతిఁ జేసి, ప్రాయ మొకయించుక జాఱఁగ, గొడ్డు [4]వీఁగి, య
ద్భుతముగఁ గాంచెఁ బూర్వకృతపుణ్యఫలంబున నొక్కకన్యకన్.

23


తే.

పద్మదళనేత్రి, సౌందర్యభరితగాత్రి, | బాల తనభార్య కిట్లు సంభవము నొందఁ
గాంచి, శివశర్మ దానికి గ్రహము లైదు | నిధనమున నున్న, నేష్యంబు నిర్ణయించి.

24


చ.

మనమున ఖేదమంది నిజమానిని కిట్లను, నో లతాంగి! యీ
తనయకు వల్లభుం డగునతండు మహామహుఁడయ్యు, నేడునా
ళ్ళన జమువీటికిం జనఁగలం డిది తప్పదు, పూర్వజన్మమం
దొనరిచినట్టి కర్మఫల మూరకపోవునె యెంతవారికిన్?

25
  1. బ్రియతనమొప్ప - మా,త, తా
  2. పశుబంధనంబు - మ
  3. సమృద్ధ - తి, తీ
  4. వీడి - ర