పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

వరాహపురాణము


ఉ.

ధీరత రుక్మిణీముఖసతీవితతిం గ్రమయుక్తిఁ బెండ్లియై
ద్వారక నేలుచుండునెడ, ధర్మతనూజుఁడు దిగ్జయార్జితో
దారపదార్థజాతములు తమ్ములు దెచ్చిన, రాజసూయ మిం
పార నొనర్పఁగాఁ దలఁచి, [1]యాప్తజనుం దనపాలి కంపినన్.

217


క.

ఇంద్రాదిదివిజ[2]వందితుఁ | డింద్రోపలనిభుఁడు, కృష్ణుఁ డిచ్ఛాపురుషుం
డింద్రజసాంద్రస్నేహుం | డింద్రప్రస్థమున కరిగె హితపరివృతుఁడై.

218

శిశుపాలవధ

సీ.

అత్తఱి, శ్రీకృష్ణుఁ డరుగుదెంచిన వార్త | విని, పాండుతనయు లావిష్ణుమూర్తి
కెదు రేఁగి, యర్ఘ్యాదివిదితార్చనంబుల | [3]వందనాదుల నుత్సవం బొనర్చి,
యతని సమ్మతమున నాధర్మసూనుండు | రాజసూయమహాధ్వర మ్మొనర్చి,
ధరణీసురుల నిష్టదక్షిణాదులఁ దన్పి | యవభృథస్నానంబు లర్థిఁ జేసి,


తే.

యార్యభూసురమునిసమూ[4]హములలోన | హరికి నర్పించె జనపాలుఁ డగ్రపూజ
యది విలోకించి, శిశుపాలుఁ డాగ్రహించి, సమదుఁడై పల్కెఁ దత్సభాసదులు వినఁగ.

219


ఉ.

ఈసభయం దకృత్య [5]మిది యిట్లొనరించి నరేంద్రుబుద్ధి పూ
ర్మేసెనొ? కాక, జ్ఞానమున మించిన సంయమివర్యు లుండఁగా,
భూసురు లుండఁగా, నృపతిపుంగవు లుండఁగ, నగ్రపూజకుం
గాసుకుఁబోని యీపసులకాపరి, [6]పేదరి గొల్లఁ డర్హుఁడే?

220


చ.

అని, తన కంత్యకాలము సమాగతమౌట యెఱుంగలేక, నిం
దన మొనరించు చైద్యుని, మదస్ఫురితానుచితప్రలాపునిం
గనుఁగొని, కృష్ణుఁ డా[7]ఖలుని కంఠమృణాళముఁ [8]ద్రెంచె, హేమభా
జన మను సాధనంబున నిశాచరభీకరరోషదీప్తుఁడై.

221
  1. యాప్తజునిం - తీ
  2. వంద్యుం - మ, తా, తి,హ,క
  3. వందనాదుల - స్నానంబులర్థిఁజేసి ర.ప్ర. లో లుప్తము
  4. హములతోన - మ,మా,త, తీ,హ,ర,క
  5. విధి - తా కంటె భిన్న ప్ర.
  6. పాడరి - త, పాదరి (పాదలి?) - తా; పాపము - మా
  7. బలుని - తా
  8. ద్రుంచె - హ