పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

145

కంససంహారము

వ.

అంతఁ గంసుండు రామకృష్ణాగమనంబు చారులవలన నెఱింగి, నిజమందిరద్వారంబున
మదధారానిస్తంద్రంబగు కువలయాపీడకరీంద్రంబును నిలిపి, ముష్టికచాణూరాదిమల్లులు
గొలువ, నిజసభాభవనంబున రత్నసింహాసనాసీనుండై యుండె. అప్పుడు రామకృష్ణులు
రథావతరణంబు చేసి, యక్రూరు ననిపి, పాదచారులై, మధురాపురంబు ప్రవేశించి, రాజ
మార్గంబునఁ బౌరజనంబులకు లోచనోత్సవం బొనరింపుచు, నృపభవనంబు చేరంజని, తద్వా
రంబున నున్న మదదంతావళంబు నుత్పాటించి కుంభంబులు వ్రయ్య నడిచి, నేలం గూల్చి,
భీకరాకారులై కంసు సమీపంబునకుం జని,

212


మ.

కకుబంతద్విపతుల్యరూపముల, రంగక్షోణిఁ జాణూరము
ష్టికమల్లేంద్రు లెదిర్చినన్, యదుకులశ్రేష్ఠుల్ నిరాఘాటస
త్త్వకళాజృంభితముష్టిఘాతముల విధ్వస్తాంగులం జేసి, నే
లకు వ్రాల న్సమయించి, మల్లవిజయాలంకారులై వెండియున్.

213


చ.

కినుక మనంబునం [1]బొదలఁ గృష్ణుఁడు కంసునిమీఁది కొక్కచం
గన వడి దాఁటి, తచ్ఛిరము గాత్రముతోఁ బెడఁబాపి, కాలునిం
గనుఁగొన నంపి, తజ్జనకుఁ గ్రమ్మఱ రాజ్యమునందు నిల్పి, భూ
వినుతముగాఁగ ధర్మ మభివృద్ధి వహింపఁగఁజేసి వెండియున్.

214


ఉ.

[2]దేవకిఁ గాంచి మ్రొక్కి, వసుదేవునికిం బ్రణమిల్లి, వారిచే
దీవనలంది శౌరి, బలదేవుఁడుఁ దానును నిర్గమించి, బృం
దావనవాటికిం జని, ముదంబున గోపనితంబినీరతి
శ్రీవశుఁడై, మురారి విహరింపుచునుండెఁ గ్రమక్రమంబునన్.

215


ఉ.

 కౌరవపాండవప్రథనకోలమునం జని, సవ్యసాచికిన్
సారథియై, సుయోధనునిశౌర్యము మాపి, యుధిష్ఠిరు న్మహీ
భారధురీణతస్థితికిఁ బట్టము కట్టి, మురారిదైత్యసం
హార మొనర్చి, సర్వవిజయప్రమదంబున విఱ్ఱవీఁగుచున్.

216
  1. దొడర - త
  2. ఈ ప. తా.ప్ర. లో లుప్తము