పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

వరాహపురాణము


సీ.

శకటాదిఘోరరాక్షసుల నిర్మూలించి, | వృషభుని సమవర్తివీటి కనిపి,
[1]బకతృణవర్తుల వికలత నొందించి, | యఘదైత్యు విగళితప్రాణుఁ జేసి,
యమునాతరంగిణియందుఁ గాళియు నొంచి, | పల్లవతతి నగ్నివలనఁ గాచి,
ఘనుఁ బ్రలంబుని జంపి, మునిసతుల్ దెచ్చిన | [2]దివ్యాశనంబులఁ దృప్తి నొంది,


తే.

యశ్రమంబున గోవర్ధనాద్రి యెత్తి, | బహువిధంబుల బలరామసహితుఁ డగుచుఁ
గృష్ణబాలుండు తనయిచ్చఁ గ్రీడ సలిపె | శౌర్య ముప్పొంగ నందవ్రజంబునందు.

205


వ.

అంత.

206


చ.

కలుషగుణావతంసుఁ డగు కంసుఁడు చారులచేత రామకృ
ష్ణుల భుజసత్త్వవిక్రమయశోగుణవర్తనముల్ క్రమంబునన్
దెలిసి, తలంకి, వారల వధింప నుపాయము లూహ సేసి, యా
బలయుతమూర్తులం బిలువఁ[3]బంపెదఁగా కని నిశ్చితాత్ముఁడై.

207


తే.

ధీరు నక్రూరుఁ బిలిచి, యో భూరిపుణ్య! | చనుము తేరెక్కి నందగోష్ఠమున [4]కిపుడ,
రామకృష్ణుల నిటకు శీఘ్రమునఁ దెమ్ము | నావు, డక్రూరుఁడును దత్క్షణంబ కదలి.

208


ఉ.

మందకు నేఁగి, బాలుఁడగు మాధవుఁ గన్గొని, [5]సంస్తుతింపుచున్
వందన మాచరించి, యదువల్లభ! తా మధురాపురంబులో
నం దగు కార్ముకోత్సవ మొనర్పుచు, మిమ్మటఁ బిల్వఁబంచె, సం
క్రందనభోగ[6]శాలియగు కంసుఁ, డన న్విని శౌరి నవ్వుచున్.

209


శా.

ఆ యక్రూరునితో హితాన్నముల నాహారించి, కృష్ణుండు కౌం
తేయ[7]క్షేమ మతండు చెప్పినను బ్రీతిం బొంది, యా మంద నా
రే యెల్లం జనినం, బ్రభాతవిధు లర్థిం దీర్చి, తే రెక్కి, తే
జోయుక్తుల్ బలకృష్ణు లేఁగి, రల కంసుం జూడ సాక్రూరులై.

210


క.

అరుగునెడ, గోపికలు త | ద్విరహమ్మున కోర్వలేక వెనుదగిలిన, నా
హరి వారల నుచితోక్తుల | మరలంగా ననిపి, చనియె మధురాపురికిన్.

211
  1. వెస - తీ; బల - తి
  2. దివ్యోదనం - తా
  3. బంచెద - తా
  4. కీవు - తీ
  5. సంతసింపుచున్ - తా
  6. రాశి - మ
  7. క్షేత్ర - మ, హ, ర