పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

143


వ.

అని చెప్పిన విని కంసుండు నిర్విణ్ణమానసుండై పశ్చాత్తాపంబు నొంది, వీరల [1]నడ్డ
పెట్టనేల? యని దేవకీవసుదేవుల శృంఖలాబంధవిముక్తుల జేసి, నిజనివాసంబున కనిపి,
తాను నాత్మమందిరమున కరిగె. అంత, నట [2]వ్రేపల్లెలోన నందుండు రోహిణీగర్భజాతుం
డగు రామునకును, గృష్ణునకును స్వపురోహితుండగు గర్గుచేత జాతకర్మాదిసంస్కారంబులు
చేయించి, విప్రులకు గోసహస్రంబుల నొసంగి, పరమోత్సాహంబున నున్న సమయంబున.

198


చ.

మదమునఁ గంసభూవిభుఁ డమాత్యులతోఁ గొలువుండి, కృష్ణుఁ డా
యదుకులమందుఁ బుట్టిన రహస్యము సర్వము నొక్కనాఁడు నా
రదమునిచే నెఱింగి, మును రౌద్రముగా దివినుండి యోగినీ
సుదతి యుపన్యసించిన వచోవిధముం దలపోసి, భీతుఁడై.

199


చ.

వ్రజమునఁ బుట్టినట్టి శిశువర్గమునెల్ల వధింపుమంచు నా
కుజనుఁడు పూతనం బనుప, ఘోరనిశాచరి మర్త్యకాంతయై
నిజకుచమండలి న్విషము నించి, చలింపక నందగేహ మ
క్కజముగఁ జొచ్చి, కృష్ణుఁ బొడగాంచి, తగన్ గిలిగింతవుచ్చుచున్.

200

కృష్ణుని బాలక్రీడలు

ఆ.

[3]చేఁపి పాలు గారెఁ జిన్నారి[4]యన్న! నా | చన్నుగుడువు మనుచు సంభ్రమమునఁ
జూచుకంబు నోరఁ జొనిపినఁ, గైతవ | బాలుఁ డపుడు తమకపాటుతోడ.

201


క.

కరములఁ దత్కుచకుంభము | దొరకంగాఁ దొడఁగి పట్టి, దుర్వారబల
స్ఫురణమునఁ గుడువఁ, దనచ | న్నెరియుటయును దైత్యభామ యేచిన నొప్పిన్.

202


క.

విడు [5]విడు మనుచును, బెదవులు | తడుపుచు, నోర్మొత్తుకొనుచుఁ, దనుఁ బడఁద్రోవన్
విడువక , తత్ప్రాణంబులు | వెడలఁగఁ గుచవిషము శిశువు వెసఁ బీల్చుటయున్.

203


వ.

బాలఘాతిని యగు నాపూతన విగతప్రాణయై, శైలంబుకరణిం గనుపించె. సురలు
హర్దోత్కర్షంబునం గుసుమవర్షంబులు గురిసిరి. వెండియు, నృశంసుండగు కంసుండు తమ్ము
హింసించుటకు ఘోరాకారులగు దానవవీరులం బనిచిన, బాలక్రీడాచరిష్ణుండగు విష్ణుండు
సంభ్రమంబున.

204
  1. నడ్డు - తీ
  2. రేపల్లె - అన్ని ప్ర.
  3. చేఁపె - ర
  4. నాయన్న - క
  5. విడువు మనుచుఁ - మ, మా, తా, తి, తీ,హ,ర, క