పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

141


క.

పురుషోత్తముఁ డుదరంబునఁ | బెరుగన్, సతిబడుగునడుము [1]పెంపు వహించెన్,
సిరిగల దొర లోఁబడినను | నిఱుపేదలకై నఁ గలిమి [2]నెలకొనకున్నే?

183


చ.

హరి యుదయించి క్రోలఁగలఁ డంచుఁ దలంచి, సుధారసంబు వి
స్ఫురితసువర్ణకుంభములఁ బూర్ణము చేసి, వినీలపాత్రముల్
మఱువుగ మీఁద మూసినక్రమంబునఁ, జూడఁగ నొప్పె దేవకీ
తరుణికుచంబు, లగ్రములఁ - దార్కొనియుండిన [3]నీలిమంబునన్.

184


తే.

అతివ భక్షింప లోనికి నరుగు మంటి | పెల్ల గమి యొప్పెఁ, 'దనభారమెల్ల మాన్పు'
మనుచు గర్భస్థుఁడైన పద్మాక్షుఁ జేర | సూక్ష్మగతి నేఁగు మేదినీసుదతి యనఁగ.

185


తే.

దేవకీదేవిగర్భమందిరములోని | విష్ణుదీపంబు కొడి నాభి వెడలి పాఱ,
దాని యంజనరేఖచందమునఁ బొలిచె | మిగుల నలుపెక్కి నూఁగారు పొగడఁ [4]దగుచు.

186


చ.

క్రమమున నిట్టి చిహ్నములు గల్గిన గర్భము, [5]నాఁడునాఁట సం
భ్రమమున వృద్ధిపొంద, దశమంబగు మాసమునందు, సన్ముహూ
ర్తమునను, శంఖచక్రకలితంబగు వేషమువాని, దేవకీ
రమణి, కుమారునిం గనియె, రత్నవిభూషణభూషితాంగునిన్.

187


క.

[6]సుత[7]భూమికాధరుండై | యతివకు నిట్లుదితుఁడైన యబ్జాక్షు, జగ
న్నుతుఁ గనుఁగొని వసుదేవుఁడు | హితవాచాకౌశలమున నిట్లని పొగడెన్.

188


సీ.

జయ సర్వమంగళాస్పద! నిత్య! నిరవద్య! | జయ దయారసపూర్ణచారునయన!
జయ నిత్యకల్యాణ! సనకాదిసంసేవ్య | జయ లోకనాయక! [8]నియతపుణ్య!
జయ శంఖచక్రలాంఛన! కౌస్తుభాంకిత! | జయ కోటికందర్పసదృశరూప!
జయ భాగవతమనోజలజమధ్యనివాస | జయ సర్వ! [9]భోగిప్రశస్త[10]తల్ప!


తే.

జయ రమాకామినీనాథ! సకలపూర్ణ ! | జయ మహేంద్రాదివందితచరణకమల!
జయ సదానందమయ! జగజ్జాలరూప! | జయ ఝషాద్యవతారవిస్పష్ట చరిత!

189
  1. పెంపొదవించెన్ - తా
  2. లోగొన (యతి?) - మ, తా,హ,ర
  3. నీలిమంబనన్ - మ.మా ,త, తా, తీ,హ,ర,క
  4. దగఁగ క; దగను - ఇతర ప్ర.
  5. నాఁడునాటి - అన్ని ప్ర
  6. నుత - త,తా,హ
  7. కామికా - తా
  8. నిరత - మా
  9. లోక - తీ; భోగ - త,తా
  10. తత్త్వ - ర