పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

వరాహపురాణము


తే.

దేవకీవసుదేవులఁ దిరుగఁ దెచ్చి | యాత్మపురమునఁ గారాగృహంబునందు
నునిచెఁ, గొన్నాళ్ల కొకపుత్రుఁ [1]డుదితుఁడైన | దేవకీభర్త కంసక్షమావిభునకు.

174


క.

ఆనినుఁగు నొసఁగుటయుఁ, ద | త్సూనృతమున కాత్మ మెచ్చి, తోడనె మగుడం
గా నిచ్చెను వసుదేవున | కానందనుఁ గంసనృపతి యానందమునన్.

175


ఉ.

అంతట నొక్కనాఁడు కలహాశనమౌనివరుండు కంసభూ
కాంతుని గానవచ్చి, నృపకల్పితపూజలఁ బ్రీతిఁ బొంది, శ్రీ
కాంతుఁడు దేవకీతరుణిగర్భమునం దుదయించు గోప్యవృ
త్తాంతము చెప్పిపోవుటయు, నా చపలాత్ముఁడు భీతచిత్తుఁడై.

176


క.

[2]తొలుచూలువాఁడు మొదలుగఁ | జెలియలికిం బుట్టినట్టి శిశువులఁ, గోపా
కులచిత్తుఁడగుచు నార్వురఁ | బొలి[3]యించి, దురాత్ముఁ డుచితబుద్ధిచ్యుతుఁడై.

177


తే.

జనకుఁడగు నుగ్రసేనుని, ననపరాధు |శృంఖలాబద్ధచరణుని జేసి యునిచి,
జగతి [4]వాలించె నా జరాసంధముఖ్య | దానవశ్రేణి తనమాటలోన నడవ.

178

శ్రీకృష్ణజననము

ఉ.

వారిజనాభుఁ డంత యదువంశమునం దుదయించి, 'మేదినీ
భారము [5]మానుఁగా!' కనుచు భావమునం దలపోసి, యోగమా
యారమణిం గనుంగొని, ప్రియంబున నిట్లను “దేవి! దేవకీ
నీరజగంధిగర్భమున నిల్చినవాఁ డురగేంద్రుఁ, డాతనిన్.

179


తే.

వెలఁది! నీమాయ నచ్చోటు వెడలఁ దిగిచి | రోహిణీగర్భ[6]మందు నేరుపున నిడుము;
అల యశోదకు నందన వగుము నీవు; | ఏను దేవకియం దుదయించువాఁడ."

180


క.

అని నియమించిన, మాయా | వనితామణి యట్ల చేసె, వారిజనాభుం
డును దేవకి గర్భంబున | నొనరఁ బ్రవేశింప, నాపయోరుహముఖికిన్.

181


ఆ.

[7]తవనతప్పి యుములు తఱుచయ్యె మోమునఁ | [8]బలుకఁబాటు గొంత తొలఁకరించె,
నలసభావ మొదవె, నఖిలార్థములమీఁద | నరుచి పుట్టెఁ, దొడలు మెఱుఁగులెక్కె.

182
  1. డుదితమైన - తా,హ; డుదయమైన - త
  2. ఈ ప. మా.ర. ప్ర లో లుప్తము.
  3. యించెం గంసుఁ డుచిత - త
  4. బాలించె - ర; పాలించె - తీ
  5. మాన్తుఁగాక - త,ర
  6. మునను - తి, తీ,హ,ర
  7. తపన దప్పి మా, త; తనువు దప్పి - తా,క; తమము దప్పి- తి,తీ
  8. బలకబారె - మ.మా, తా, తి, తీ,హ,ర,క