పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

139


మ.

క్రమ మొప్ప న్వసుదేవుగేహమున కీకాంతామణిన్, దేవకిం
బ్రమదం బొందుచు నంపె దీ వకట! నీపాలింటికిన్ మృత్యువై
[1]కమలానాథుఁడు నిన్వధింపఁగలఁ, డీకంజాతపత్రాక్షి య
ష్టమగర్భంబున సంభవించి తుదఁ, గంసా! సంశయం బేటికిన్?

167


క.

అని యశరీరియుఁ బలికిన | సునిశితవాక్యంబు, తప్తశూలముమాడ్కిన్
దనచెవులు గాఁడిపాఱిన, | ఘనభయమున సంచలించెఁ గంసుం [2]డంతన్.

168


ఉ.

దేహవినాశమూలమగు తీవ్రవిషావృతమైనయట్టి యా
బాహువుఁ ద్రెంచి, మేను నిలుపందగు నందురు, కాన, సోదరీ
స్నేహము సేయుటొప్ప దని, చెల్లెలి ముందలపట్టి, యాజగ
ద్ద్రోహి గళంబుఁ ద్రెంచుటకు దోరసి యెత్తినఁ, జూచి యత్తఱిన్.

169


క.

వసుదేవుఁడు ప్రాణేశ్వరి | యసువుల [3]పోకడకు నులికి, యాకంసుని సా
హసకృత్యము మాన్పుటకై, | యెసఁగఁగ మృదువాక్యగతుల నిట్లని పలికెన్.

170


మ.

విను, కంసక్షితినాథ! కీర్తిసుగుణాన్వీ[4]తుండ, వీ సోదరీ
హననం బిట్లొనరింప నీ కగునె? విప్రానీకముం, గామినీ
జనులున్ [5]రాజు కవధ్యు, లీగగనభాష ల్నమ్మఁగావచ్చునే?
మనుజుం డాడిన నమ్మరాదఁట! సుధీమార్గంబుఁ బాటింపవే!

171


చ.

చలమున వేఁగురించి సతిఁ జంపినఁ, బాపము దక్కుఁగాని, కాఁ
గలపని కాకమానదు, జగన్నుత! కోపము మాను, ధర్మముం
దలఁప, దయావిశేషము మనంబున నిల్పుము, భామఁ [6]దున్మఁగా
వల, దటుగాకయున్న జనవల్లభ! వి న్మొకమాట చెప్పెదన్.

172


క.

సుదతీమణి గర్భంబున | నుదయించిన సుతులఁ జంప నొసఁగెద, నీబె
ట్టిద ముడుగు మనినఁ, గంసుఁడు | మదిఁ గోపము [7]మట్టుపఱచి మహితప్రౌఢిన్.

173
  1. కమలాధీశుఁడు - క; కమలానాభుఁడు - మ
  2. డలుకన్ - మ,మా,త,తా,తి,హ,ర,క
  3. పోకపుడు - మ, త, తా, తి,హ,ర,క
  4. తుండవై, సోదరిన్ - త
  5. రేని - తీ
  6. ద్రుంచగా - తీ
  7. ముట్టమరచి - తా