పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

వరాహపురాణము


చ.

సరసిజనాభ! నీచరణసారసభక్తివిహీనులైన [1]దు
ష్పురుషులు వేదమార్గములఁ బోవక, దారసుతాదిసక్తులై
దురితము లాచరించి, తుద దుర్గతిఁ బొందుదు, రెంతవారలుం
బరమవివేక! నీమహిమ మపారము ముట్టనెఱుంగనేర్తురే?

161


తే.

అఖిలలోకేశ! పారపర్యంతరూప | పారపారగ! వారిజపత్రనేత్ర!
విశ్వ[2]రూప! నమోస్తుతే వేదవినుత! | పాహి [3]నస్త్రాహి దేవ! శేషాహిశయన!

162


చ.

అని వినుతింపుచుం ప్రణతులై హరికిన్, శిశుపాలముఖ్యదు
ర్జను లుదయించి, పద్మజవరంబున నున్మదులై, జగత్త్రయం
బునకు నొనర్చు బాధవిధమున్ వినిపించినఁ జూచి, యా సనా
తనుఁడగు వేల్పుఱేఁడు ప్రమదంబున వారలతోడ నిట్లనున్.

163


సీ.

అంబుజాసనదత్తమగు వరంబున మదో | [4]న్మాదులౌ శిశుపాలకాదిదనుజ
వీరుల బాధించువిధ మెఱుంగుదు, వారు | సమకాలమునఁ గాని సమసిపోరు,
పదఁడు, నిర్జరులు గోపాలకులయ్యును, | సురకామినులు గోపతరుణులయ్యు,
నామ్నాయములు గోసహస్రంబులయ్యును | మేదినిమిఁద జన్మింపుఁ డిపుడ,


తే.

యంత, యదువంశమందుఁ గృష్ణాహ్వయమున | భువనరక్షాపరుండనై యవతరించి,
దనుజవంశంబు [5]నున్మూలితంబు చేసి, | యెల్లి నేఁటనె భూభారమెల్ల డింతు.

164


వ.

అని, దనుజాంతకుం డంతర్ధానంబు నొందె. వాసవాదులు నిజనివాసంబున కరిగి,
నారాయణోపదిష్ట ప్రకారంబున, నిజాంశంబుల గోపాలకులయ్యు, నమరకామినులు గోపిక
లయ్యును, నిగమంబులు గోగణంబులయ్యును సంభవించిరి. తత్సమయంబున.

165


సీ.

విను ముగ్రసేననందనుఁడు కంసుం డను | వాఁడు, సోదరియైన వనజ[6]ముఖిని,
దేవకి యను నామధేయంబు గలదాని, | వసుదేవుఁ డను యదువంశజునకుఁ
బరిణయం బొనరించి, బహుపదార్థము లిచ్చి, యత్తవారింటికి [7]ననుపఁదలఁచి,
యరదంబుపై వధూవరుల నెక్కించి, తా | సారథియై నిల్చి, తేరు గడపి ,


తే.

నిరుపమోత్సాహభరితుఁడై యరుగుచున్న | యవసరంబున వినువారి కద్భుతముగఁ,
గంసునకుఁ గర్ణశూలంబు గాఁగ, నభ్ర | వాణి యిట్లని పల్కె దుర్వారఫణితి.

166
  1. తత్పురుషులు - తా
  2. నాథ - మ,మా, తి, తీ, హ,ర,క; నేత - త
  3. మాం పాహి దేవేశ పాహిశయన - తా
  4. ద్ధారులై - మ, తా, తి, ర; ద్గారులై - హ
  5. నిర్మూలితంబు - తా,తీ
  6. నేత్ర - తీ
  7. నంప - తి