పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

137


మ.

[1]అమరాధీశసహాయులై సురలు, దుగ్ధాంభోధిలో శేషభో
గమహాతల్పమునన్ శయించిన రమా[2]కాంతున్ , జగద్గర్భునిం
గమలాక్షుం గని, చాఁగి మ్రొక్కి, కరయుగ్మంబుల్ శిరోవీథులం
బ్రమదంబొప్ప [3]ఘటించి, యిట్లని నుతింపంజొచ్చి రాదేవునిన్.

156


చ.

నియత[4]గుణచ్ఛటారహిత! నిర్జర[5]వంద్య! విరోధిదైత్యదు
ర్జయ! కరుణాసుధారసవిరాజితనేత్రసరోజ! సంశ్రిత
ప్రియ! కమలాముఖాంబురుహభృంగకులోత్తమ! నిత్య! నిర్మలా
శ్రయ! శశిభాస్కరాక్షియుగ! శంఖసుదర్శనశార్ఙ్గలాంఛనా!

157


సీ.

మాధవ! నరసింహ! మధుకైటభాంతక! | దేవ! జగన్నాథ! [6]దివిజవంద్య!
ధారాధరప్రభాపూరనిర్మలదేహ! | దారుణదైత్యేంద్రదర్పహరణ!
శతకోటిమన్మథసౌందర్యసంపన్న! | సాంద్రవైభవ! పతగేంద్రగమన!
కుండలద్యుతిగమ్యగండమండలభాగ! | దర్వీకరేశ్వరతల్పశయన!


తే.

సతతనారదసంగీత[7]సక్తహృదయ! | సచ్చిదానంద! నిర్గుణ! సర్వపూర్ణ!
భక్తజనలోకరక్షణ! పరమపురుష! | యాపదలఁ బాపి[8] మముఁ బ్రోవు మంబుజాక్ష!

158


ఉ.

భౌతికదేహధారులగు ప్రాణులు తావకనామమంత్రముం
బ్రీతి జపించి, ప్రాగ్దురితబృందము వాసి, పునర్భవాటవీ
వ్రాతము సొచ్చి పోక , యపవర్గముఁ గాంచి సుఖింతు, రర్కజై
వాతృకనేత్ర! భక్తజనవత్సల! మాధవ! మేదినీధవా!

159


శా.

ఆశాపాశవిముక్తులయ్యును వశిష్ఠాదుల్ మహాత్ముల్, పురో
డాశం బెవ్వరిఁగూర్చి వేల్చినను వేడ్కం [9]దత్తదాకారివై
ప్రాశస్త్యంబుగఁ బావకార్పితహవిర్భాగంబులన్ సమ్మదా
వేశం బొప్ప భుజించి, యాగఫల మీవే యిత్తు తత్కర్తకున్.

160
  1. అమరాంభోధి - తీ
  2. నాథున్ (యతి?) - తీ
  3. గ సంఘటించి వినుతిం - త
  4. గుణోజ్జ్వలామహిత - తీ
  5. నంద్య - తీ
  6. దివ్య - త
  7. సరస - క
  8. ననఁ గృపఁ బ్రోవవయ్య (యతి?) - క
  9. దత్ఫలాకారివై - హ