పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

135


మ.

తిరుగ న్వారిధి దాఁటి, రాఘవధరిత్రీనాథచూడామణిం
గరమర్థిం గని, 'కంటి సీత' ననుచుం గల్యాణవార్తాపుర
స్సరభావంబున, నింతిచేఁ గొనిన భాస్వద్రత్న [1]మర్పించి, తా
ధరణిం జాఁగిలి మ్రొక్కి నిల్చిన, మహోత్సాహంబుతో రాముఁడున్.

141


ఉ.

ప్రాణము ప్రాణమైన ప్రియభామిని మంగళవార్త దెచ్చి, నా
ప్రాణము నిల్పి, లోకమున భానుకులోద్ధరణప్రసిద్ధపా
రీణుఁడవైతి, తావకచరిత్ర [2]1విచిత్రమటంచు నా జగ
త్ప్రాణకుమారునిం బొగడి, పల్మఱుఁ గౌఁగిటఁ జేర్చి, యత్తఱిన్.

142


క.

భానుసుతానీతములగు | వానరసైన్యములతోడ వసుధ చలింపం
గా [3]నరిగి, వార్ధిఁ గట్టి, చ | మూనివహము సేతుమార్గమున దాఁటుటయున్.

143


సీ.

శరణాగతత్రాణబిరుదవిఖ్యాతుఁ డా | జానకీపతి, విభీషణుఁడు వచ్చి
మఱువుచొచ్చినఁ గాఁచి, మహిమ లంకాపుర | ప్రాకారముల చుట్టు వార [4]విడిసి,
కుంభకర్ణుని శౌర్యజృంభణంబు హరించి, I నారాచముల మేఘనాదుఁ గూల్చి,
దశకంఠకంఠకాంతారంబు నిజబాణ | [5]వితతిదావాగ్ని కాహుతి యొనర్చి,


తే.

జయము గొని, సీతతోడ లక్ష్మణునితోడఁ | బుష్పకారూఢుఁడై సైన్యములు భజింప
సురలు జయపెట్ట, నలరులసోన గురియఁ | దిరిగి రాముఁడు సాకేతపురికి నరిగె.

144


వ.

ఇవ్విధంబున జయవిజయులు రెండవజన్మంబున రావణకుంభకర్ణులై, రాఘవేశ్వరు
బాణంబులచేత ప్రాణంబులం బాసి, మూఁడవజన్మంబున ద్వాపరయుగంబునందు దౌవారికులు
శిశుపాలదంతవక్త్రులై జనియించి, లోకకంటకులై వర్తించుచున్న సమయంబున.

145

కృష్ణబుద్ధకల్క్యవతారకార్యములు

చ.

జలరుహలోచనుండు, హరి, సాధుజనావనశాలి, దేవతా
తిలకము, కృష్ణనామమున దేవకిగర్భమునం జనించి, య
చ్చలమునఁ గంస కేశి ముర సాల్వులతో శిశుపాల దంతవ
క్త్రులఁ దెగటార్చి, గోపికలకుం బ్రియుఁడై విహరించె వేడుకన్.

146


తే.

బుద్ధరూపంబు దాల్చి యంభోజనాభుఁ | డసురవీరుల మోహాబ్ధియందు ముంచె;
భావికాలంబునకుఁ గల్కిభావ మంది | ఖలజనంబుల మర్ధింపఁగలఁడు శౌరి.

147
  1. మున్నిచ్చి - త
  2. ముచిత్ర - త; పవిత్ర - క
  3. నేఁగి - మా,తి,ర
  4. విడిచి - అన్ని ప్ర.
  5. వితత - మ,మా,త