పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

133


ఉ.

ఓమునిసార్వభౌమ! సుగుణోజ్జ్వల! నిష్ఫలనిర్మితంబు లీ
తామరచూలిచే విరచితంబగు విశ్వమునందు, మేషికా
స్తోమగళస్తనంబులును, శోభితదానవిహీనహస్తముల్,
రామకథాసుధారసతరంగిణిఁ దేలని కర్ణజిహ్వలున్.

127


వ.

కావున, రామాయణకథాక్రమంబు వినిపించెద. ఆకర్ణింపుము. తొల్లి రావణకుంభ
కర్ణాదిదానవబాధాపరిపీడితులై దేవతలు ప్రార్థించిన, నారాయణుడు భానువంశోద్భవుం
డగు దశరథనరేంద్రునకుం దనయంశంబున రాముండును, శేషునియంశంబున లక్ష్మ
ణుండును, శంఖచక్రాంశంబుల భరతశత్రుఘ్ను లన, నలువురు తనూభవులం బుట్టించిన,
వారు [1]క్రమక్రమప్రవర్ధమాను లగుచుండ, నొక్కనాఁడు.

128


క.

గాధితనూజుఁడు దశరథ | భూధవుకడ కేఁగుదెంచి, పూజితుఁడై శౌ
ర్యాధికుల రామలక్ష్మణ | యోధుల నిజయజ్ఞరక్ష యొనరించుటకున్.

129


ఉ.

పాటవ మొప్ప వేఁడి, జనపాలకుఁ డంపిన, వారితోఁ దపో
[2]వాటిక కేఁగుచో, నెదురు వచ్చిన రాక్షసిఁ, గామరూపిణిన్,
దాటకఁ జూప, నాదశరథక్షితిపాగ్రసుతుండు దాని లా
లాటము గాఁడనేసిన, నిలాస్థలిఁ గూలె నిశాటి చయ్యనన్.

130


క.

దాశరథి మఱియు యజ్ఞవి | నాశకులగు నుగ్రదైత్యనాథుల నుద్దం
డాశుగశతములఁ బొరిగొని | కౌశికుయాగంబు పూర్ణగతి నొందించెన్.

131


చ.

ప్రథనము లిట్లు గెల్చి, మునిరత్నముతోడ స[3]లక్ష్మణంబుగా
మిథిలకు నేఁగి, శంకరుని [4]మెచ్చులచాపము రెండుగాఁ బరి
శ్లథ మొనరించి, సీత, శుభలక్షణఁ గైకొని, భార్గవుం బర
శ్వథధరు నోర్చి, మోదమునఁ జాఁగి యయోధ్యకు [5]వచ్చి, వెండియున్.

132


క.

కేకయతనయావశుఁడై | భూకాంతుం డనుప, జనకపుత్రికతో సు
శ్లోకుండగు లక్ష్మణుతో | సాకేతపురంబు వెడలి సరభసగతులన్.

133
  1. క్రమంబుగ వర్ధ - తా,తి, తీ
  2. వాటికి నేఁగు - త
  3. లక్ష్మణుండు - హ
  4. మెచ్చగు - తి, తీ
  5. నేగి - తీ