పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

వరాహపురాణము


క.

[1]అనవుడు, బలి యొడఁబడుటయు | దనుజాంతకుఁ డప్పు డొకపదంబున ధరణిన్,
ఘనమార్గము నొక[2]చరణం | బునఁ గలయఁగ నాక్రమించె భువనోన్నతుఁడై.

120


క.

దానవవర్యుని నురగ | స్థానంబున నిల్పి, యభయదానంబున ని
త్యానందపూరపూరిత | మానసులంజేసె హరి, యమర్త్యుల నెల్లన్.

121


క.

ఆవేళ మీఁదఁజూచిన | శ్రీవరు చరణంబు జలముచే నింపుగ వా
ణీవిభుఁడు గడుగ, నది దు | ర్గావల్లభుమౌళి నిల్చె గంగానదియై.

122


ఉ.

మానితలీలఁ బద్మజకమండలుపూరితవారి, యిందిరా
జానిపదంబు సోఁకి, దివిషన్నదియై ప్రవహించి, స్వర్గసో
పానమనంగఁ బొల్చె, విను, పాతకి యైనను ముక్తి[3]గామియౌ
మానవుఁ డానదిన్ మకర[4]మాఘదినంబులఁ దానమాడినన్.

123


వ.

అని చెప్పి వెండియు నిట్లనియె.

124

పరశురామావతారవర్ణనము

ఉ.

తామరసేక్షణుండు జమదగ్నికి రాముఁడనం జనించి, యు
ద్దామమదంబునం బితృవధం బొనరించిన క్షత్రియాన్వయ
స్తోమముఁ జుట్టుముట్టి, నిజదోర్బలశౌర్యమహత్త్వ మేర్పడన్
భీమకుఠారపాతములఁ బేర్చి హరించెఁ ద్రిసప్తవారముల్.

125

శ్రీరామావతారవర్ణనము

చ.

జయవిజయాహ్వయుల్ మును నిశాచరులై [5]జలజాయతాక్షుచే
క్షయమును బొంది, రెండవ యుగంబున రావణకుంభకర్ణులై
రయమున లోకముల్ చెఱుప, రాముఁడనా నుదయించి, వారి ని
ర్దయత వధించెఁ జక్రి, విను, తచ్చరితంబు సవిస్తరంబుగన్.

126
  1. అనుటయు - హ
  2. పాదం - తీ
  3. గాంచు, నే - క
  4. మాస - తీ
  5. జలజాక్షుచేత సం - మ,మా, తా, తి, తీ,హ,ర,క