పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

131


ఉ.

వారిభయంబు మాన్ప, సురవత్సలుఁ డాదివరాహమూర్తియై
ఘోరనిశాచరుం దునిమి, కుంభిని మేరువుతోడ నెంతయున్
బీర మెలర్పఁ, గొమ్ముతుద వేయవపాలున నుద్ధరించి, బృం
దారకకోటిఁ గాచె, [1]నది నాకు హరుం డెఱిఁగించె సర్వమున్.

113


చ.

అనుడు, మృకండునందనమహాముని రోమశుఁ బల్కె, నో కథా
వననిధి! యిందిరావిభుఁడు వామనమూర్తి ధరించి, యాచరిం
చిన చరితంబు కర్ణపుటచిత్తరసాయన మండ్రు కోవిదుల్,
వినియెదఁ దచ్చరిత్రము ప్ర వీణత [2]మీఱ నుపన్యసింపవే!

114


వ.

అనిన రోమశుం డమ్మహాత్మున కిట్లనియె.

115

వామనావతారవర్ణనము

మ.

హరి, రక్షోహరణంబు సేయుటకు మాయావామనాకారుఁడై
గరిమన్ ఛత్రము, యజ్ఞసూత్రమును, సత్కౌపీనమున్, మౌంజియున్
సరవిం దాల్చి, బలీంద్రుఁ గల్గొని, “విభో! స్వస్త్యస్తుతే" యంచు, వి
స్ఫురితాశీర్వచనంబు లిచ్చి, కుహనాపూర్వంబుగా నిట్లనున్.

116


చ.

అరయఁగ [3]మేరువైనఁ బరమాణునిభంబగు నన్య[4]యాచ్ఞకుం
దొరఁ[5]కొనెనేని, నీగతి ఘనుండగు నుత్తమదాత కల్గినం
దిరముగ నర్థి విద్య సురధేనువుపోల్కి ఫలించు, సిగ్గునం
[6]దఱుఁగని యర్థి మేరుగిరిఁ దక్కువగాఁ దలపోయు నుబ్బునన్.

117


క.

అడుగుట హీనము, వేఁడిన | నిడకుండుట యంతకన్న హీనము, విభు నె
క్కుడు వేఁడఁగఁ దగ దర్థికి, I నొడఁబడఁగా వేఁడ నిచ్చు టొప్పుం బతికిన్.

118


ఉ.

కుందక యిత్తు వర్థులకుఁ గోరినయర్థము లంచు , గోఁచి ము
ప్పందుము గట్టఁగాఁ దలఁచు పామరవిప్రుఁడఁ గాను, నాకు నా
నందముతోడ నిమ్ము చరణత్రయమాత్రధరిత్రి, దాన మి
న్నందెద, నల్పదానమున నైన సుఖంపనివాఁడు నార్యుఁడే?

119
  1. నిది - త,హ
  2. మీరు - తా
  3. జిత్రమైన - మా
  4. యాచ్న - అన్ని ప్ర.
  5. కొననీను - త
  6. దఱిఁగిన - తీ. భిన్న ప్ర.