పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

వరాహపురాణము


మ.

తలవంపయ్యె భుజంగరాజునకుఁ, దద్ధాత్రీభరం బానఁగా
నలవింతైనను [1]1లేమిఁ గూర్మపతి సర్వాంగంబులుం గుంచి య
ప్పులపాలై తిరిగెన్, దిశాకరి చయంబుం బెక్కుగండంబులం
జలనం బుప్పతిలంగ మ్రొగ్గెఁ గడునాశ్చర్యంబుగా నత్తఱిన్.

106


ఉ.

భేదము మాని వార్ధు లొక[2]పెట్టున నాల్గును మేరదప్పి, యే
కోదకమైనఁ గాంచి, సురయూధపులెల్ల భయాకులాత్ములై
యీదెస మాన్ప దిక్కుగలదే హరిదక్కఁ[3]గ నంచు, నాపదం
భోదసమీరు, నాపరమ[4]పూరుషు నిట్లు నుతించి రందఱున్.

107


సీ.

[5]“సకలజగన్నాథ! శంఖచక్రాంకిత! | జలజాలయాధీశ! జలజనయన!
దళి[6]తరాక్షస! జగత్కల్యాణ! సజ్జన | నిలయ! నీరదనీల! నీలదేహ!
గ్రహ[7]నాథ తారకారాజ రాజిత[8]నేత్ర! | ఘనతరహారకంకణకిరీట!
సచ్చిదానంద! నిశ్చల! దయాసాగర! | సత్య! సత్యజ్ఞాన! [9]సత్యసహిత!


తే.

జలజజాతాదినతనిజచరణనలిన! | అండజాధీశకేతన! యజ్[10]5దాత!
సతతనారదసంగీతసక్తచిత్త! | శ్రితజనానీకరక్షణ! శేషశయన!

108


క.

జయ సర్వమంగళాలయ! | జయ జయ యోగీంద్రహృదయజలరుహ వసతే!
జయ గోవింద! మురారే! | జయ జయ నః పాహి” యనిరి సకలామరులున్.

109


చ.

ఉరవడి వార్థిలో మునుఁగుచున్నది మేరువు ధాత్రితోడ, నె
వ్వరు నిది మాన్సనోపరు, జవంబున నేక్రియనైన రాక్షసుం
బొరిగొని, నీటిలోఁ గలసిపోయెడి ధారుణి నుద్ధరింపవే!
హరి! జగదీశ! మాధవ! జనార్దన! దానవలోకమర్దనా!

110


వ.

అని యివ్విధంబున.

111


క.

హరిమాయామోహితులై | సుర లది శీతాంశుఖండజూటకృతముగా
నెఱుఁగక, రాక్షసకృత మని | మొఱలిడుటయు, నాలకించి మురభంజనుఁడున్.

112
  1. లేక కూర్మ - తీ
  2. బెట్టుగ - మా, త
  3. నటంచు - తీ
  4. పుణ్యుని- మ,మా,త,తా,తి,హ,ర,క
  5. ఇది నిరోష్ఠ్యసీసపద్యము.
  6. తాఘతత - తీ; తదుర్జన - ర
  7. రాజ - తీ
  8. నయన - మ,మా, తి, తీ,హ,ర,క
  9. సహితరూప - మ,మా,తి; సహితహృదయ - తీ, ర; సహితరూఢ - క
  10. ధాత - తీ; నాథ - త; వాత - హ