పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

వరాహపురాణము


వ.

అని మత్స్యావతారవృత్తాంతంబు చెప్పి, సంతతానందుండును, రోమహర్షుండు నగు
రోమశుండు వెండియు నిట్లనియె.

90

కూర్మావతారవర్ణనము

మ.

హరిఁ బూజింపక దేవదైత్యులు మహాహంకారసంపన్నతా
గరిమన్ సాహసవంతులై, నిజభుజాగర్వంబు ప్రేరేప, మం
దరశైలంబున సాగరంబుఁ దరువన్, దద్వార్ధిమధ్యంబునన్
గిరిరాజంబు మునింగె, దానవవరుల్ గీర్వాణులుం జూడఁగన్.

91


మ.

సమదామర్త్యనిశాచరేశ్వరభుజాసత్త్వోద్భవంబైన గ
ర్వము సర్వంబును వీటిఁబుచ్చి, కరుణావ్యాసంగుఁడై , కూర్మరూ
పమునం దోఁచి మురారి యెత్తె భువనప్రఖ్యాతిగా [1]బాఢసం
భ్రమ[2]నశ్యజ్జలజంతుజాల మగు నామంథా[3]నకుత్కీలమున్.

92


క.

వ్రతదానతీర్థసేవా | క్రతుముఖ్యములైన విహితకర్మంబులు శ్రీ
పతి వర్జితంబులైనను | బ్రతిహతములు గాక యున్నె బహువిఘ్నములన్.

93


ఉ.

వెండియు దేవదానవులు విష్ణుపదాంబుజభక్తి లేక యు
ద్దండమదంబునం దిరుగఁ, దద్బల[4]గర్వము మాన్పఁ బంకజా
క్షుం డొకశాపకైతవము చూపి, జయాదుల దైత్యయోనిఁ బు
ట్టుండని [5]పంప, నందొకభటుండు హిరణ్యవిలోచనాఖ్యుఁడై.

94


ఉ.

ధారుణిఁ బుట్టి, బాహుబలదర్పితుఁడై, కనకాచలంబు బృం
దారకమందిరం బనుచుఁ దద్గిరితో ధరఁ బెల్లగించి, గం
భీర పయోనిధానమునఁ బేర్చి [6]గుభిల్లన [7]వైచె, వైచినన్
భూరిభయంబునం దివిజపుంగవముఖ్యులు కంపితాత్ములై.

95


శా.

బాహాగర్వము లుజ్జగించి, కరుణాపాథోనిధిం, బక్షిరా
డ్వాహుం [8]బ్రస్తుతి సేయ, విష్ణుఁడు దయావర్ధిష్ణుఁడై వచ్చి వా
రాహాకారము దాల్చి యెత్తె, నిజదంష్ట్రాదండకోటీఘనో
త్సాహుండై సచరా[9]చరంబగు ధరా[10]చక్రం బవక్రాకృతిన్

96
  1. బాడ - త: బాధ - తి; బాద - మా, తా, తీ; బాఠ-మ,హ,ర,క
  2. నశ్యం-అన్ని ప్ర
  3. నమత్కీలమున్ - వ ; సముచ్ఛైలమున్ - మా; నముంగీటమున్ - క
  4. వర్గము - తా
  5. పంపె - తీ
  6. గుభేలున - మ, చూ, తా,హ
  7. వైవఁజూచినన్ - తా
  8. సంస్తుతి - మా, త
  9. చరస్థపృథివీసర్వంబవక్రా - క
  10. చక్రంబు చక్రాకృతిన్ - మ, తా