పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

127

మత్స్యావతారవర్ణనము

సీ.

మధ్యాహ్నమార్తాండమండలప్రతిమాన | దారుణదీర్ఘనేత్రములతోడ
[1]నంత్యకాలోద్దండయమదండచండతా | లంఘనచతురవాలంబుతోడ
తిమితిమింగిలముఖ్యసమధికాంభశ్చర | గ్రాసార్థవివృతవక్త్రమ్ముతోడ
మైనాకముఖశైల[2]రీణతాయోగ్యాంగ | [3]సంధిగృహప్రపంచంబుతోడ


తే.

నొకమహామీనమై శౌరి యుదధిలోన | దురము గావించి [4]సోమకాసురుని దునిమి
శ్రుతులఁ గొనివచ్చి మేదినీసురుల కిచ్చె | నన, మృకండుతనూజుఁ డిట్లనియె మునికి.

84


చ.

అకట! నిజప్రయోజనసహాయతకై హరి తానె మున్ను [5]సో
ముకుని సృజించి, క్రమ్మర సముద్రములోన వధించెనన్న, నే
రికి విన నింపుగాదు; విషవృక్షమునైనను బెట్టి పెంచి, తాఁ
బెకలిచివైచునే కరుణపేరు నెఱుంగని ఘాతుకాత్ముఁడున్?

85


వ.

అనిన మార్కండేయునకు రోమశుం డిట్లనియె.

86


సీ.

వినుము, కార్యార్థమై వనజాక్షుఁ డొకవేళ | తనదాసులం దొకతప్పు వెట్టి,
యవనిపై రాక్షసులై సంభవము నొంది | గర్వితులగువారి గర్వ మడఁపుఁ
డని యానతిచ్చిన, నావిష్ణుభక్తులు | దారుణ బాహాప్రతాప మమరఁ
గ్రవ్యాదులై పుట్టి గర్వితారాతుల | నణఁగించి కృతకార్యులైన పిదప,


తే.

వీరు నా చేతఁ దెగ కన్యవీరవరుల | చేత హతులైన ముక్తికిఁ జేర రనుచు
నాత్మఁ దలపోసి, సమరంబులందుఁ దఱమి | తానె [6]వధియించు హరి యాతుధానవరుల.

87


క.

హరి యెవ్వనిఁ దాఁ జంపక | పరుచేఁ జంపించు, వాఁడు భవ[7]బంధుండై
ధరణీతలమున నక్తం | చరవంశమునందుఁ దిరుగ జననము నొందున్.

88


తే.

సురలు గర్వింప, యామినీచరులచేత | మానభంగంబు నొందించు; దానవేంద్రు
లాత్మదర్పింప, నప్పు డాయమరవరుల | చేతఁ దగుశిక్ష చేయించు శ్రీవిభుండు.

89
  1. యవధికాలో - మా,త
  2. రీనతా - మ ,తీ, క; లీనతా - మా,త; దీనతో - తా; నతా - తి,హ,ర
  3. సంధి గృహా - మా,త; సంధిగుహ - తా; నందీగృహ - తి,హ; బందీగ్రహ - తీ; సందగృహ - ర; సందీహ - మ
  4. సోముకా - మ,మా
  5. సోమకుని (యతి?)-త,హ,ర
  6. హరియించు - తీ
  7. బద్ధుండై - తా