పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

వరాహపురాణము


నిద్దంబులగు చెక్కుటద్దంబుల మకరిపత్రంబులై పొంకంబులగు రత్నతాటంకంబులకాంతి
పటలంబు [1]తటంబులం బుటంబులు గొనుచుండఁ, జరమసంధ్యారుణజలధరరేఖాగ్రంబున
వీక్షణీయంబగు నక్షత్రంబు తెఱంగున నధరపల్లవోపరిభాగంబున [2]నాసాభరణమౌక్తికంబు
చూపట్ట, ఫాలభాగంబున మృగనాభితిలకం బరచందురునడిమి కందుచందంబున నయనా
నందం బొనర్ప, నాసిక యను తెర యిరుగడలం బరిణయంబునకు నాసన్నులైన చకోర
వధూవరుల సిరు [3]లంగీకరించిన దీర్ఘనేత్రంబులు శతపత్రమిత్రంబులు లావణ్యపత్రంబులు నై
చెలంగ, నంధకారంబునందుఁ గానంబడు తారకాజాలంబులీలం గబరికాభారంబునందు
మల్లికాకుసుమంబులు విలసిల్ల, గంకణకేయూరముద్రికాదిదివ్యభూషణకరంబులగు
కరంబులు [4]భక్తాభయంకరంబులయి శోభిల్ల, దివ్యాంబరాలంకృతయై, సహస్రసూర్యసంకాశ
ప్రభా[5]భారంబగు నాకారంబుతో సాక్షాత్కరించి, విష్ణుమాయాదేవి మందగమనంబున నేతెంచి,
యరవిందభవునిముందఱ నిల్చినంతఁ, బుండరీకాక్షుండును యోగనిద్ర చాలించి, నిజ
నాభిసరోజకర్ణికాసమాసీనుండగు హిరణ్యగర్భుని గృపాగర్భితంబులగు చూపుల నవలోకించిన,
నతండు నిటలతటఘటితాంజలియై యిట్లని విన్నవించె.

53


మ.

అరిషడ్వర్గము నిగ్రహించి, మమతాహంకారముల్ ద్రించి, బం
ధురభక్తిం దప మాచరించిన మహాత్ముల్ బోధవిద్యాధురం
ధరులుం గానని నీస్వరూపమును నేత్రప్రీతిగాఁ జూడఁగం
టి రమావల్లభ! వేయునేల? తుదముట్టెన్ జన్మ మబ్జేక్షణా!

54


క.

హరి విష్ణుండు రమాపతి | యరవిందాక్షుండు చక్రి యహిశాయి యతీ
శ్వరహృదయనిలయుఁడని నిను | మఱవక కీర్తింతుఁ గృతనమస్కారుఁడనై.

55


తే.

బాలుఁడను బుద్ధిహీనుఁడ భ్రాంతియుతుఁడఁ | గార్యకారణమూఢుఁడఁ, గాన నన్నుఁ
గరుణ రక్షింపు రక్షింపు కమలనాభ! | జనకకృత్యంబు పుత్రరక్షణమె కాదె?

56


సీ.

అవధరింపుము, దేవ! భువనత్రయము మున్ను | సృజియించి మానససృష్టి చేసి,
యా లోకములయందు [6]నద్రికాననవార్ధి | దేశనదీలోకదివిజమనుజ
తారకాగ్రహచంద్రతపనమునీశ్వర | కిన్నర[7]గారుడపన్నగేంద్ర
గంధర్వయక్షరాక్షసకామినీజన | పశుతురంగమకీటపక్షితతుల


తే.

ధృతి వినిర్మింపఁ, గాలచోదితము లగుచు | నవియు నన్యోన్యవైరమహత్త్వమునను
సమసె, నటమీఁది కృత్యంపుఁజంద మెఱుఁగ | నేరకున్నాఁడఁ గరుణింపు నీరజాక్ష!

57
  1. నిటలంబుల - తీ
  2. నాసామౌక్తికాభరణంబు - తీ
  3. ఆలంకరించిన - త
  4. భక్తాభయశోభనంబులై - క
  5. ధారంబగు - మ,మా, త, తి ,హ,ర
  6. నర్థి - తి; నబ్ధి - తీ
  7. కింపురుష - మ,మా,త, తాతి,హ,ర,క