పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

119


సీ.

మూలముల్ [1]మీఁదు కొమ్ములు క్రిందునై చాల | నున్నతంబై మించు నొక్కతరువు
వేదపర్ణంబుల విలసిల్లుఁ, [2]దత్పక్వ | ఫలము లెవ్వారికిఁ దెలియఁబడవు,
ఆహారియును నిరాహారియునై రెండు | పక్షు[3]లు తరువునఁ బాయకుండు,
నతినిశ్చలంబైన యా ఖగద్వితయంబు | నురుశక్తి నైక్యంబు నొందఁజేసి


తే.

యమ్మహీజమ్ముఁ బాలింప నణఁపఁజాలి | తత్ఫలశ్రేణి [4]నిజభక్తతికి నొసఁగు
నీ మహత్త్వంబు, వర్ణింప నేర్తు నెట్లు? | శరధికన్యాకళత్ర! తామరసనేత్ర!

38


క.

బాలుఁడను బుద్ధిహీనుఁడ | నాలోకింపుము కృపాకటాక్షముల ననున్;
మేలుకొన సమయ మయ్యెను | [5]చాలింపుము యోగనిద్ర [6]సకలశరణ్యా!

39


వ.

అని యిట్లు హిరణ్యగర్భుం డుచితవాక్యసందర్భంబున నుతించి, ప్రార్థించిన, నా
జగద్గర్భుండు మేల్కనకున్న, నది యోగమాయాశక్తి[7]కృత్యంబని నిర్ణయించి, నిద్రారూపంబున
సంక్రమించిన జగన్మోహనకారిణియగు నా యోగమాయ నిట్లని స్తుతించె.

40


విష్ణుదుర్గాస్తవము

శ్లో.

వందే౽హం [8]దేవి! పాదారవిందే! మందేతరార్చితే!
[9]తావకే సేవకేష్టాపవర్గే! దుర్లే! మదంబికే!

41


వ.

అని నమస్కరించి, వెండియు నిట్లనియె.

42


క.

శ్రీపతిని యోగనిద్రా | రూపంబున నలము కాలరూపిణివగు నీ
శ్రీపదములు సేవించెదఁ | దాపత్రయదుఃఖజలధితారణమునకున్.

43


ఉ.

కంబుసమానకంఠికి, జగత్త్రయదేవకిరీటరత్నభా
చుంబితపాదపీఠి, కతిశోభనమూ ర్తికిఁ, బల్లవావళీ
బింబసమాధరోష్ఠి, కరిభీకరశూలసమేతయైన దు
ర్గాంబకు, విష్ణుశక్తికి ననంతనమస్కృతు లాచరించెదన్.

44
  1. మెండుకొమ్మలు (యతి?) - మ,మా, తి,హ,ర,క; మెండల్పముగ శాఖములు గల్గి - తీ
  2. దత్వము - త
  3. లా తరువును - తీ
  4. నీభక్త - మ, తా; తద్భక్త - క
  5. పాలింపుము - తీ
  6. వదలి - తీ
  7. కృతంబని - త,హ,ర
  8. దేహి - త
  9. తావకసేవకిష్టా - మ; తావకే సేవకిష్టా - మా,త; తావకస్సేవకేష్టా - తి,తీ, ర; తావకీసేవకేష్టా - తా