పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

వరాహపురాణము


చ.

వినుము మునీంద్ర! పూర్వమున [1]విష్ణుమయుండగు నాదిమూర్తిచే
వనజ[2]భవాండమందు, భవవారిజమిత్రమృగాంకయక్షస
న్మునిమను[3]మానవామరమనోభవకిన్నరరాజమానమై
జననము నొందె విశ్వమును సాగరశైలవనాంతరీపమై.

9


సీ.

నారాయణుం డాత్మనాభీసరోజమ | ధ్యమమున బ్రహ్మయై యవతరించి,
మహదహంకారాది మహనీయసాధన | సంపత్సమేతుఁడై చతురుఁ డగుచు,
నంబరసర్వంసహానలజలమారు | తము లనుపంచభూతములతోడ,
నిర్మించె, నవియును నిర్మంపఁ[4]గలవియు | ననఁ బెక్కు గలవు బ్రహ్మాండకోట్లు,


తే.

నందు నెచ్చట [5]నేకార్య మావహిలునొ | పుండరీకాక్షుఁడైన దేవుండు దక్క
నరసి [6]యిదమిత్థమని పల్క నజుఁడు నోపఁ, | డెట్లు మముబోఁటి కీటాత్ము లెఱుఁగఁగలరు.

10


మ.

హరిమాయా[7]పిహితంబులై పొడము [8]బ్రహ్మాండావళుల్ తద్రమా
వరుసామర్థ్యము, మూర్తివైభవగుణవ్యాపారకృత్యంబులున్
బరిపాటిం గొనియాడ వేదములు నప్రాజ్ఞంబులై యుండు, వి
స్తరభంగిం బ్రకటింప మాదృశులకున్ శక్యంబె? విద్వన్నుతా!

11


శ్రీహరి మాహాత్మ్యము

వ.

మునీంద్రా! వినుము. ఆ యాదిపురుషం గొందఱు కాలరూపి యనియును, గొందఱు
విజ్ఞానరూపి యనియును, గొందఱు తేజోరూపి యనియును, గొందఱు భాస్కరరూపి
యనియును, గొందఱు బ్రహ్మరూపి యనియును, గొందఱు శంఖచక్రగదాశార్జ్ఞచిహ్ని
తుండనియును, గొందఱు మృత్యుంజయుం డనియును, [9]గొందఱు పరబ్రహ్మం బనియును
బ్రతిపాదింతురు; కాని, తదీయ[10]తాత్త్వికరూపంబు నిర్ణయింపనేరరు. ఆ వైకుంఠ
నాయకుండును, బహురూపావృతాత్మకుండునునై [11]జ్ఞానయోగభక్తియోగకర్మయోగంబుల
నుపాసింపంబడి, తత్కర్మఫలంబుల నొసంగుచు సర్వభూతాంత[12]ర్యామియై యుండు.
వెండియు,

12
  1. విశ్వ - మా
  2. భవాంత - తీ; భవామరేంద్రభవ - మా, త
  3. మానవాదిగ - మా,త
  4. గాఁగలయవి పెక్కు - తీ
  5. తానయై యతిశయిలుచు - మ, తా,క
  6. యరవింద - త
  7. విహితంబు - మ,మా, తా, తి, తీ,హ,ర,క
  8. బ్రహ్మాండంబు లా శ్రీరమా - తీ
  9. గొందఱు పరబ్రహ్మం బనియును - తీ. ప్ర. లోని పాఠము
  10. సాత్త్విక - మ,మా,త,తి,తీ,హ,ర,క
  11. ధ్యాన - అన్ని ప్ర.
  12. ర్యామియైన వాసుదేవుం డుండు - త