పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

109


ఉ.

[1]చూచితె యొక్కచోద్యము యశోధన! నీసుతు నంబురాశిలో
వైచినవేళ నొక్కఫణివర్యుఁడు వచ్చి, తదీయబంధని
ర్మోచన మాచరించి, [2]యనుమోదమునం గొనిపోయి, వార్ధిరా
ద్వీచిపరంపరావిమలవేశ్మము సొచ్చెఁ బ్రసన్నమూర్తియై.

290


క.

ఊహింపఁగఁ బ్రహ్లాదుని | మాహాత్మ్యము ఘనము, నీకుమారుఁడె? దైత్య
శ్రీ హరియింపఁగ వచ్చిన | శ్రీహరి గాకెందు నిట్టిచిత్రము గలదే?

291


క.

[3]అని విన్నవింపుచుండం | దనుజేంద్రుఁడు చారముఖము[4]నం దాప్రహ్లా
దునిరాక విని సముద్య | ద్ఘనరోషదవాగ్నిశిఖలు గగనము ముట్టన్.

292


హిరణ్యకశిపుఁడు పుత్రవధార్ధము ససైన్యము వెడలుట

క.

[5][6]కులము చెడఁ గుఱ్ఱసుతునిం | బొలియించెద నేనె యనుచు, భూరికృపాణా
జ్జ్వలహస్తుఁడై చతుర్విధ | బలములతోఁ బురము వెడలె భయరహితుండై.

293


చ.

అమరవిరోధిసైన్యచరణాహతిజాతములై ధరాపరా
గములు దిశావకాశములు గప్పి, కనుంగొన [7]నొప్పె, నిందిరా
రమణుఁడు చంపునంతకును రాక్షసుఁ డొండెడ కేఁగె నేనిఁ గా
ర్యము చెడునంచు నప్పుడ రయంబునఁ గండ్లరికట్టెనో యనన్.

294


క.

కడు వడి దానవసేనలు | నడచునెడం దద్భరంబున ధరణి వణఁకెన్,
బొడిమన్ను రాలె శేషుని | పడగలు వెయ్యింటిమీఁదఁ బాతాళమునన్.

295


ఉ.

వాసవుఁ డాత్మపక్షములు వజ్రహతిం దునుమాడఁ గొండ లా
యీసునఁ దద్విరోధి దనుజేంద్రుని జేరెననంగ, దాన[8]ధా
రాసముదగ్రనిర్ఝరపరంపరతోఁ గనుపట్టె దైత్యసే
నాసమదద్విపంబు [9]లవి నమ్రరిపువ్రజనిష్కృపంబులై.

296


చ.

జలరుహబాంధవుం డమరశైలముచుట్టును నెక్కి యాడుచో
వలపలివాగె కాని గరువంబున దాపలివాగె ద్రిప్పినన్
మలఁగవు, నీరథాశ్వములు మా కెనగావని, హేషితారవ
చ్ఛలమున నార్చి నవ్వు, సురశాత్రవసైన్యతురంగమావళుల్.

297
  1. చూచితి మొక్క - మ,మా,తా,హ,ర,క
  2. యును - తీ
  3. ఈ ప. తీ. ప్ర.లో లుప్తము.
  4. నందం - తా
  5. ప. 293, 294 మా. ప్ర.లో లుప్తము.
  6. కులము పాడగుట - తీ; కులము చెడగుట - తి,ర
  7. నొచ్చి - అన్ని ప్ర
  8. వారాసముదగ్ర - అన్ని ప్ర.
  9. లు వినమ్ర - తీ