పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

వరాహపురాణము


తే.

నలిననిలయావరేణ్య! నీనామపఠన | వజ్రపంజరమధ్యమవర్తియైన
నాశరీరంబునకు నేల నాశ మొదవు? | దానవాధముఘోరకృత్యములవలన.

284


చ.

కమలభవాదిదైవతనికాయములున్, సనకాదియోగిబృం
దములును, నారదాదిమునినాయక వర్గములున్, విశిష్టక
ర్మము లొనరించియైన, సుకరంబుగఁ గానఁగలేని, నీస్వరూ
పము గనుఁగొంటిఁ, దొల్లిటితపంబులు నాకు ఫలించె నన్నియున్.

285


తే.

జన్మసాఫల్య మయ్యె నీచరణకమల | దర్శనంబునఁ బ్రాగ్దురితంబు లణఁగెఁ,
గనకకశిపుని దండించి కమలనాభ! | ధర్మసంస్థాపనము సేయు [1]దయ దలిర్ప.

285


మ.

అని ప్రహ్లాదుఁడు విన్నవించిన, సరోజాక్షుండు మందస్మితా
ననుఁడై, యిట్లను, విన్ము దైత్యసుత! నిం దానైపుణిన్ [2]మించు నీ
జనకుం దున్ముదు, ధర్మ మేర్పఱతు, దుష్టశ్రేణి ఖండింతు, వ
ర్ధన మొందం బ్రకటింతు వేదతతులన్, దండింతుఁ బాషండులన్.

286


మ.

అభిషేకింతుఁ బురందరుం ద్రిదశరాజ్యంబందు, బూర్వాకృతిన్,
విభవోపేతులఁ జేసి సాత్త్వికులఁ గావింతు న్మహీమర్త్యులన్,
శుభసంపన్నుఁడవై సహస్రభువనస్తుత్యుండవై యుండు, నీ
కభయంబిచ్చితి, నేఁగు నీపురికిఁ బుత్రా! వైష్ణవాగ్రేసరా!

287


క.

అని పలికినఁ, బ్రహ్లాదుం | [3]డనుముదితస్వాంతుఁ డగుచు నబ్జాక్షునకున్
వినతు లొనరించి, సంశయ | మను [4]2లత ఖండించి, [5]మగుడి యరిగెం బురికిన్.

288


దనుజకింకరులు దానవపతికిఁ జోద్యమును విన్నవించుట

వ.

ఇట్లు ప్రహ్లాదుండు పురంబున కరుగునట మున్న, యతని వనథిం ద్రోచి చనిన కింకరులు
హిరణ్యకశిపుసమ్ముఖంబునం గరకమలంబులు [6]మొగిచి నిలిచి, వధ్యశిలారోపణంబు
మొదలను సముద్ర[7]నిపాతనంబు తుదయు నగు కుమారునివృత్తాంతంబు సర్వంబును
విన్నవించి, వెండియు నిట్లనిరి.

289
  1. నిర్మలాత్మ - క
  2. మించె నీజనకుం డున్మదదర్పమేర్పరతు - అన్ని ప్ర.
  3. డునుముదితస్వాంతుఁ డగుచు నుతులను బంకే | జనయనునికడ సంశయ - తీ
  4. తల - మ,తి,హ,ర,క
  5. మగుడనరిగెం - మ,తా,తి,తీ,హ,ర,క
  6. ముకుళించి - తీ
  7. నిర్హేతనము - మ,తి,హ,ర