పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

107

పుండరీకాక్షుఁడు ప్రహ్లాదుని బరీక్షించుట

ఉ.

వెండియు, దైత్యు లగ్నివిషవేదనకృత్యము లాచరించియున్
జండతఁ జూపియుం దునుమఁజాలక, బాలకు నుగ్రపాశబం
ధుండుగఁ జేసి, యంబునిధిఁ ద్రోచినఁ, దత్సలిలంబులోపలన్
గొండొకమగ్నుఁడై, మది ముకుందుని బేర్కొనుచుండు నత్తఱిన్.

277


ఉ.

పంకరుహాక్షుఁ, డార్తజనపాలనదక్షుఁడు, శేషభోగిప
ర్యంకుఁడు, శంఖచక్రకలితాంకుఁడు డగ్గఱు వచ్చి, యాత్మ వా
మాంకమునందు దైత్యతనయాగ్రణి నుంచి, శిరంబు దువ్వి, క్షే
మంకర వాగ్విశేషమున మచ్చిగఁ దేల్పుచుఁ గూర్మి నిట్లనున్.

278


చ.

జనకునియాజ్ఞ నిల్పక, నిశాచరకోటి కసమ్మతుండవై,
ఘనతరచక్రకుంతశరఖడ్గగజోరగవహ్నిముఖ్యవే
దనముల నొంది, యిట్లు సతతంబు కృశింపుచు, బాల్యచాపలం
బున మృతిపొందె దేమిటికి బుద్ధివిహీనుఁడవై కుమారకా?

279


సీ.

అఖిలలోకస్వామియైన నీజనకుఁ డే | కాతపత్రంబుగా నసురరాజ్య
మంతయుఁ బాలింప, నతని యాజ్ఞాస్థితిఁ | ద్రోయక బుద్ధిమంతుండ వగుచు
నీతిశాస్త్రాభ్యాసనిపుణమానసుఁడవై | యువ[1]రాజపట్టవైభవము దాల్చి,
యంబరాభరణమాల్యాలేపనాదుల | నర్థిఁ గైకొని రత్నహర్మ్యములను,


తే.

మృదులశయ్యాతలంబున మదనపరవ | శాంగనాజన[2]ప్రియసమాలింగనాది
సురతసౌఖ్యంబు లనుభవించుటకుఁ బాసి, యాపదలఁ బొందఁ దగునె ప్రహ్లాద! నీకు?

280


క.

నావుడుఁ, దత్తనుసంగో | ద్భావితసుజ్ఞానమహిమఁ బరమేశునిగా
భావించి, దనుజపతిసుతుఁ | డావనజాక్షునకు వినతుఁడై యిట్లనియెన్.

281


ప్రహ్లాదుని ప్రార్థనము

క.

తల్లివి తండ్రివి జీవిత | వల్లభుఁడవు నీవ కాక వసుమతి [3]నాకుం
దల్లి యనఁ దండ్రి యనగా | వల్లభుఁ డన నొరులు గలరె వనజదళాక్షా?

282
  1. రాజ్య - అన్ని ప్ర.
  2. కుచ - మా,త
  3. లోనం - మ,క