పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

వరాహపురాణము


చ.

గురువులు సంతసింప, ననుకూలుఁడవై, పఠియించితే మనో
[1]హరముగ నీతిశాస్త్రము సమస్తము నన్న! కుమార! నిన్నుఁ బా
మరులగు దైత్య[2]నందనులు మందుఁ డటందురు, వారిమాట బో
ల్పఱచుటకై పఠింపు మొకపద్యము, నర్థవిశేషహృద్యమున్.

255


వ.

అనినఁ బ్రహ్లాదుఁ డిట్లనియె.

256


ప్రహ్లాదుని విష్ణుతత్త్వవినిర్ణయము

క.

చదివితి [3]హరిగుణగణములు, | చదివితిఁ దత్పాదభక్తిసాధనములు, నేఁ
జదివితి [4]నతని మహత్త్వముఁ | జదువులలో నింతకంటెఁ జదువులు గలవే?

257


క.

జననస్థితివిలయములకు | వనజోదరుఁ డతఁడు కర్త వర్ణింపఁగ నీ
కనుభవకారణ మగు నీ | ఘనరాజ్యప్రాప్తి యతని కరుణన కాదే?

258


సీ.

ఆద్యంతశూన్యుఁ, డవ్యయుఁ, డజేయుఁడు, లోక | నాథుండు దుర్జననాశకరుఁడు,
బహుకోటిభాస్కరప్రతిమానతేజుండు | సజ్జనహృత్పద్మసదనవర్తి,
యాశ్రితసురభూజ, మఖిలభూతాంతర | స్థైర్యక్రియావేది, సర్వసముఁడు,
సనకాదియోగీంద్రసంతతధ్యేయుండు, | త్రిగుణవ్యతీతుండు, దివిజవంద్యుఁ


తే.

డమల[5]చరితుఁడు, భాగవతానురాగి, | [6]విశ్వమయమూర్తి, వేదాంతవేద్యకీర్తి,
శేషపర్యంకశయనుండు శ్రీయుతుండు, | పొలుచు నన్నింటిలోఁ బరిపూర్ణుఁ డగుచు.

259


క.

హరముఖ్యు లేమహాత్ముని | చరితము సర్వంబుఁ దెలియఁజాలరు, నే నా
[7]పురుషోత్తమునిమహత్త్వము | నెఱయఁగ వర్ణింపనేర్తునే? దనుజేంద్రా!

260


ఆ.

నామనోవిహారి, నాపాలిదైవంబు, | శ్రీమహీధవుండు, శేషశాయి,
యతని నెఱుకపఱచునవి గాక చదువులు, | చక్రిఁ దెలుపలేనిచదువు చదువె?

261


క.

అని పలికిన ప్రహ్లాదుని | సునిశితవాక్యాళి కర్ణశూలములైనం
[8]గనలిపడి, యంకగతుఁడగు | తనయుని బడఁద్రోచి, భృత్యతతి కిట్లనియెన్.

262
  1. హరమగు - త
  2. బాలకులు - తీ
  3. నేహరిగుణములు - మ,తా,తి,తీ,హ,ర,క
  4. దన్మాహాత్మ్యము - మా,త; నిదన్మహత్త్వము - తా
  5. భాగవతానుగ్రహానురాగి - తా; భాగవతాజనతానురాగి - మా
  6. విబుధగణనీయవేదాంతవేద్యమూర్తి - తీ
  7. పురుషోత్తముమాహాత్మ్యము - త
  8. గని పర్యంకగతుండగు- తా; ఘనపర్యంకగతుండగు - మ; తనపర్యంకగతుండగు - తి,హ,ర; దనుజేంద్రుఁ డంకగతుఁడగు - తీ