పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

103


చ.

చలదళపల్ల[1]వాంచలనిషక్తపయఃకణభాతిఁ, జాలఁజం
చలమగు మేను నమ్మి, కలుషంబు లనేకము లాచరించి, [2]లో
తలఁపువిహీనుఁడై, పిదపఁ దత్తనువున్ బెడఁబాసి, యాతనా
కలితశరీరుఁడై, నిరయకల్పితబాధల దుఃఖ మందుచున్.

248


క.

అనుభూతపాపఫలుఁడై | పునరుద్భవ మంది, విష్ణుఁ బూజింప, మనం
బున భక్తి నిలుపనేరక | ధనదారసుతేషణములఁ దగిలి నశించున్.

249


ఉ.

ఇట్టు, సరోజనాభు భజి[3]యింప నెఱుంగక, తామసాత్ముఁడై
పుట్టుచు గిట్టుచున్, జముని పోకలఁ గీడ్పడుఁ, గాన భవ్యమై
నట్టి మనుష్యగాత్రముఁ బ్రియంబునఁ [4]గైకొని, బోధయుక్తుఁడై,
చుట్టిన ఘోరమోహదృఢసూత్రములం దెగఁగోసి, ధీరుఁడై.

250


ఉ.

చిత్తము శౌరిపాదములఁ జేర్చి, తదర్పణబుద్ధి నిత్యనై
మిత్తికకర్మముల్ నడపి, మిన్నక కామ్యని|షిద్ధదుష్క్రియా
వృత్తికిఁ బోక, సంతతము విష్ణుపరాయణుఁ డైనయట్టి వి
ద్వత్తిలకుండు, గాంచు నపవర్గము నిర్గళితాంతరాయుఁడై.

251


ఆ.

ఇది మహారహస్య, మీచందమున మీరు | బాహ్యవస్తువాంఛఁ బరిభవించి,
విశ్వమయుని, శాశ్వతైశ్వర్యుఁ గొలువుఁడీ! | దనుజతనయులార! దినదినంబు.

252


క.

అని, యివ్విధమున దానవ | తనయులకును [5]భుక్తిముక్తిదాయకమగు పా
వనవిష్ణుభక్తియోగము | నొనరఁగఁ బ్రహ్లాదవర్యుఁ డుపదేశించెన్.

253


కుమారవిద్యావైదుష్యపరీక్ష

వ.

అంత, నొక్కనాఁడు హిరణ్యకశిపుదానవేంద్రుండు మణిభూషణాంబరగంధ
మాల్యాలంకృతుండై, శూలహస్తుం డగుచు, సభాభవనంబున కేతెంచి, సింహాసనసమాసీనుండై,
రంభాద్యప్సరోనృత్యం బవలోకింపుచు, వందిమాగధసంస్తూయమాననిజబిరుదగద్యపద్య
శ్రవణజాతకౌతూహలుం డగుచు, సభాభవనంబునఁ బేరోలగంబుండి, గురుగృహంబున
నున్న ప్రహ్లాదకుమారు రావించి, నిజవామాంకపీఠంబున నునిచి, సాంత్వనపూర్వకంబుగా
నిట్లనియె.

254
  1. వాంచిత - తీ
  2. బోదలప - అన్ని ప్ర.
  3. యించు టెఱుంగక - తీ
  4. గన్గొని - మ,మా,క
  5. భక్తి - తి,తీ