పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

వరాహపురాణము

రాక్షసకుమారులకుఁ బ్రహ్లాదుని విష్ణుభక్తిప్రబోధము

క.

శ్రీరమణీవల్లభుపద | సారససుజ్ఞానమధుర[1]సస్థిరభృంగా
కారుండగు ప్రహ్లాదకు | మారుఁడు, వైష్ణవరహస్యమతములు [2]దెలుపన్.

242


చ.

మదిఁ దలపోసి, కొందఱు సమానవయస్కుల దైత్యబాలురం
గదియఁగఁ బిల్చి, మీకు హితకార్యము చెప్పెద, రండు, దుర్జనుల్
మెదలని[3]చోటి కంచు, నొకమేరకుఁ దోకొనిపోయి, వారితో
సదయవచోవిశేషములు, సాత్త్వికభావము మీఱ నిట్లనున్.

243


ఉ.

దానవపుత్రులార! సుఖదంబగు నెయ్యది మీకు, నేమిటం
గాని శరీరమోహమయగాఢతమంబు నణంపఁజాలు సు
జ్ఞానమహాప్రదీపము ప్రసన్నత [4]గైకొన, దట్టితత్త్వము
న్బూనుతలీలఁ దెల్పెద, వినుండు [5]మనంబున సావధానులై.

244


సీ.

క్షీరవారాశిలో శేషతల్పంబునఁ | బద్మాలయాభర్త పవ్వళించు,
నా సర్వమయు[6]ని నాభీసరోవరమునఁ | జతురాస్యుఁడై ధాత సంభవించె,
నతనిచే నిర్మితం బయ్యె బ్రహ్మాండంబు | పాతాళభూస్వర్గభరిత మగుచుఁ,
దత్త్రిలోకములమధ్యమలోక మైనట్టి | భూమి, సప్తద్వీపములఁ దనర్చె,


తే.

నట్టిదీవులలోన విఖ్యాతి గాంచె | జాంబవద్వీప, మంబుధిశైలగహన
మనుజగోవిప్రముఖవర్ణమానవేంద్ర | పుర[7]వనగ్రామవాహినీపూర్వ మగుచు.

245


మ.

భువన[8]స్తుత్యగుణానురూపమగు జంభూభూద్వీపమం దాత్మక
ర్మవితానానుగుణంబుగా వివిధగర్భప్రాప్తుఁడై, జీవుఁ డు
ద్భవకాలంబున సూతిమారుతము నొంపన్, యోనిమార్గంబునన్
భువికి న్వెల్వడి, మోహపాశనికరంబుల్ దన్ను బంధించినన్.

246


క.

ఎఱుక చెడి, సతతతృష్ణా | పరవశుఁడై పెరిగి, పుత్ర[9]భార్యాదులపై
మరులుగొని, విత్తకాంక్షా | [10]పరిపీడితుఁ డగుచు, [11]దీనభావాన్వితుఁడై.

247
  1. సంస్థిర - క; సుస్థిర (యతి?) - మ,మా,తి,తీ,హ,ర,క
  2. పెలుచన్ - తీ
  3. యిక్క - తీ
  4. గైకొనుఁ డట్టి - తీ
  5. ముదంబున - క
  6. నిజనాభిసరోరుహమునఁ జతుర్ముఖుఁడు దామును జనించె - తి; స్వీయమగు నాభిపంకేజమునఁ జతుర్ముఖుడు దామును జనించె - తీ
  7. వర - తా
  8. వ్యక్త - తీ
  9. దారాదులకై (యతి?) - మా
  10. పర - మ,మా,తి,తీ,హ,ర,క
  11. విత్త - తి,తీ,హ,ర