పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

వరాహపురాణము


ఉ.

వేదకళారసజ్ఞుని వివేకనిధుల్ చదివించి, రాప్తల
క్ష్మీదయితప్రసాదు, మతికీలితభాగవతప్రశస్తమ
ర్యాదు, నఖండబోధసలిలాపహృతాఖిలపాపశాదు, ప్ర
హ్లాదు, గతప్రమాదు, దనుజాంతకభక్తికృతప్రమోదునిన్.

229


ఉ.

అత్తఱి నొక్కనాఁడు దనుజాన్వయవర్యుఁడు, మంత్రిబంధుమి
త్రోత్తమసేవకుల్ గొలువ నోలగముండి, కుమారు శాస్త్రసం
పత్తిపరీక్షణార్థము కృపాయుతుఁడై పిలువంగఁ బంచినం,
దత్తనుజాతుఁ దోడ్కొని ముదంబున వచ్చిరి విప్రపుంగవుల్.

230


వ.

ఇట్లు చనుదెంచి, మహీసురులు దనుజాగ్రేసరు నాశీర్వదించి, జితమనోభవుండగు
తనూభవుని బురోభాగంబున నిలిపిన.

231


ఉ.

దానవచక్రవర్తి సుతు దగ్గఱఁదీసి, నిజాంకపీఠికా
సీనుని జేసి, మై నిమిరి, చెక్కిలి నొక్కి, యురంబు మేనితో
నాని, శిరంబు మూర్కొని, ప్రియంబున నిట్లనుఁ, బుత్ర! నీవు వి
ద్యానిధివైతి వంచుఁ గొనియాడుదు రార్యులు ప్రస్తవంబునన్.

232


క.

నీనేర్చినట్టి నీతివి | తానములో నొకసుభాషితము చదువుము, నా
కానందంబుగ, మధురవ | చోనిపుణత కెల్లవారు చోద్యంబందన్.

233


వ.

అనిన దనుజసునాసీరునకుఁ బ్రహ్లాదుం డిట్లనియె.

234


ప్రహ్లాదుని హరిభక్తి

చ.

పురుషవరేణ్య! నిత్యపరిపూర్ణముదంబున నిర్మలుండనై
గురుచరణారవిందములకుం బరిచర్య యొనర్చి, శాస్త్రవి
స్తరముఁ బఠించి, యందు పదసత్త్వవివేకము నిర్ణయించి, యే
నెఱిఁగినవాఁడఁ, దత్త్వ మది యెట్టిదనా, విను మేర్పరించెదన్.

235