పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

99


ప్రముఖాసహ్యచర్యంబగు శౌర్యంబును, స్థావరజంగమజనితభయనివారణధురీణంబగు
తనుత్రాణంబును, గరాళంబగు శూలంబును, జండంబులగు బాణకోదండంబులును వరంబు
లుగాఁ గొని, తత్కరుణాసుధాస్నపితసర్వాంగుం డగుచు, నిజపురంబున కరిగి, బలీముఖ
సుషేణ సూచీముఖ జ్వాలాముఖ [1]కంక నిషధ కుశ వజ్ర దందశూక క్రూరాక్ష కీట చిత్ర దమ
ఘోషాది ఘోరరాక్షసవీరులం గూడుకొని, చతురంగబలసమేతుండై, పరాక్రమస్పీతుం డగుచు,
సకలదేశాధిపతులం బరాజితులను జేసి, దిగీశులం గళితప్రకాశులం గావించి, గీర్వాణుల
నిస్త్రాణుల నొనర్చి, రాజ్యసంపదవలేపంబును భుజప్రతాపంబును జూపట్టఁ ద్రిభువన
పట్టాభిషిక్తుండై, రాజ్యంబు సేయుచుండఁ దదనంతరంబున.

223


ప్రహ్లాదచరిత్ర

క.

నారాయణభక్తి[2]కళా | పారాయణుఁ డగుచుఁ [3]బుట్టెఁ బ్రహ్లాదుం డా
వీరాగ్రగణ్యునకు నం | గారకపాలంబులోనఁ గమలము వోలెన్.

224


తే.

సకలకల్యాణలక్షణసంయుతుండు | సుతుఁడు జనియింపఁ [4]బుత్రవత్సుఖము గాంచె,
దర్శనాలింగనాలాపతతులవలనఁ | జారుతరమూర్తి, దానవచక్రవర్తి.

225


ఉ.

ఆదనుజేంద్రుఁ డిట్లు ప్రమదాతిశయంబును బొంది, జాతక
ర్మాదు లొనర్చి, నందనుఁ బ్రయత్నమునం బెనుపంగ, వాఁడు ని
త్యోదయవర్ధితుం డగుచునుండె, సురారియు నొక్కనాఁడు శు
క్రోదితకార్యుఁడై, నిజపురోహితులం బిలిపించి [5]యిట్లనున్.

226


ప్రహ్లాదుని విద్యాభ్యాసము

ఉ.

భూదివిజేంద్రులార! కులభూషణుఁడైన మదీయపుత్రుఁ, బ్ర
హ్లాదుని వీనిఁ బట్టి, యుపలాలనపూర్వము గాఁగ నీతిశా
స్త్రాదిరహస్యముల్ దెలియ, యత్నమునం జదివించి, దైత్యమ
ర్యాద లుపన్యసించి, చరితార్థుని జేయుఁడు సత్వరంబునన్.

227


ఆ.

అని, హిరణ్యకశిపుఁ డాత్మకుమారుని | నాపురోహితులకు నప్పగించి
యనుప, విప్రవరులు నసురేంద్రనందనుఁ | గొనుచు నిజనివాసమునకు నరిగి.

228
  1. శంఖ - మ,తా,తి,హ,ర,క
  2. సదా - మా,త
  3. నుండె - మ,మా,తి,హ,ర,క
  4. బుత్రకోత్సవము (యతి?) - మ,తా; బుత్రఉత్సవము - తి,హ,ర
  5. యిట్లనెన్ - మా,త