పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

97

నీలగళునిగూర్చి నిశాచరేంద్రుని నిర్నిరోధతపము

ఆ.

వీరసేననగరి వెడలి మాల్యవదద్రి | కందరమున నీలగళుని గూర్చి
నిరుసమానధైర్యనిస్తంద్రుఁడై, విని | శ్చలత మెఱయఁ దపము సలుపునంత.

211


సీ.

రవి వేయుఁగరముల నవనీరసముఁ గ్రోలెఁ, | దీవ్రాతపంబున దిశలు [1]వ్రీలె,
నతిదీర్ఘతరములై యహములు ప్రసరించెఁ, | గమలినీలతలు పొంకము ధరించెఁ,
జాతకంబులకుఁ దృష్ణాతురత్వము మించె, | జక్రవాయువు లుర్వి నాక్రమించెఁ,
గల్లోలినీదీర్ఘికాశ్రేణి నెఱి దప్పె, | ఘనధూళిపటల మాకసము గప్పెఁ,


తే.

గాననంబుల [2]దవపావకంబు లెదిగె, | నధ్వరావళి ధారాగృహముల నొదిగె,
భానుకాంతోపలంబులు ప్రజ్వరిల్లెఁ | జండఘర్మాగమం బిట్లు సంఘటిల్లె.

212


చ.

హరికి సుధాంబురాశి, నిటలాక్షునకుం దుహినాద్రి, భారతీ
శ్వరునకు నాభి[3]పద్మమును సద్మములై విహరింపఁగల్గఁగా,
కరయ తదుష్ణకాలనిబిడాతప[4]తాపము నిస్తరింపఁగాఁ
దరమగునే త్రిమూర్తులకుఁ?, దక్కినవారల నెన్న నేటికిన్.

213


శా.

రక్షోనాయకుఁ డిట్టివేసవిని సంరంభంబు రెట్టింపఁగాఁ
జక్షుర్వీక్షణజాలము[5]౦ దపనుపై సంధించి, ఘోరాగ్నిమ
ధ్యక్షేత్రంబునఁ బాదపల్లవనఖాంతం బూఁతగా నిల్పి, ఫా
లాక్షున్ గూర్చి తపంబు [6]సల్బె భయదవ్యాపార మేపారఁగన్.

214


వ.

అంత.

215


సీ.

జలధరంబులు [7]కులాచలము నారోహించె, | నలర విద్యుల్లత లంకురించెఁ,
బురుహూతుచాపంబు వరుణదిక్కునఁ దోఁచెఁ, | బ్రథమదిశాసమీరములు వీచెఁ,
జాతకంబుల [8]తపశ్చర్యలు ఫలియించె, | జాతీలతలు పుష్పసమితి నించె,
నీలకంఠంబులు నృత్యంబు ప్రకటించెఁ, | దాళంబు లన గర్జితములు మించె,


తే.

నీపములు పూచెఁ, దటినీకలాప మేచె, |సస్యములు హెచ్చె, రాజహంసములు నొచ్చెఁ,
[9]గమలములు వనరె, నింద్రగోపములు దనరె | లతలు చెలువారె, వానకాలంబు మీఱె.

216
  1. వీగె - క; వీచె - తా; మించె - త
  2. వనపావకంబు దిరిగె -మ,తి,తీ,హ,ర,క
  3. పంకజము స్థానము - మ,తా,తి,తీ,హ,ర,క
  4. ముగ్రత - మా
  5. మున్నినునిపై - క, మా
  6. చేసె - మా
  7. శైలచయము - మా; మహాబిలము - త; నభమందు (యతి?) - తా
  8. తపశ్చరియలు - మ,త,తి,హ,ర,క
  9. కమలములు - అన్ని ప్ర. వర్ణాధిక్యముచే గణభంగము.