పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

వరాహపురాణము


సీ.

సర్వజంతు[1]వులందు సముఁడనై వర్తింతు, | వైరంబుఁ దాల్ప నెవ్వారియెడల,
హెచ్చుగుందులు సేయ కిత్తుఁ [2]గర్మమునకుఁ | దుల్యంబుగా సుఖదుఃఖఫలము,
నల్పకాలంబైన నతి[3]దీర్ఘమై తోఁచు | దారుణశోకసంతప్తమతుల
కట్లు గావున, భూసురాన్వయవర! నీవు | నిరయంబునకు నేఁగి, - నేఁటి కేడు


తే.

దినము లయ్యెను, గర్మంబు తీవ్రపడిన | ననుభవింపకపోవునే? యరుగు మింక,
మూఁడునెలలును నిరువదిమూఁడు దినము | లుగ్రనరకాంతరంబుల నుండవలయు.

204


ఆ.

అనిన దండధరుని యాజ్ఞాక్రమంబున | నిరయ మనుభవించి, ధరణియందు
జంబుకత్వ మంది, సంత్యక్తగాత్రుఁడై, | హరిపురమున కేఁగి హర్ష మొందె.

205


వ.

అది గావున, జీవుండు బహు[4]జన్మవాసనంబునఁ బూర్వపుణ్యపరిపాకసారంబగు
మానవాకారంబు ధరియించి, సమ్యగ్జ్ఞానసమేతుండై, స్వప్నజాగ్రదవస్థలయందు హరి
నామస్మరణంబు వదలక, పుత్ర[5]దారవిత్తాదిసంగప్రచారంబు దూరంబు గావించి, యోగ
మార్గంబున నపవర్గంబుఁ జెందవలయు నని, నారదునకు శారదారమణుండు మోక్షధర్మోప
దేశంబు చేసిన క్రమంబు రోమశుండు చెప్పిన, విని సంతసించి, మార్కండేయుం
డిట్లనియె.

206


క.

జయవిజయు లిరువురందును | జయుఁడు హిరణ్యాక్షుఁ డగుచు సమసెను; విజయుం
[6]డయమహీత! యెచటి కరిగెను? | బ్రియమగు తత్క్రమము విస్తరింపుము తెలియన్.

207


వ.

అనిన మార్కండేయునకు రోమశుం డిట్లనియె.

208


హిరణ్యకశిపుని వృత్తాంతము

క.

విజయాహ్వయుండు దితిగ | ర్భజుఁడై, ఘనబాహుదర్పభాసురుఁ డగుచున్
ద్రిజగద్భయంకరాకృతి | నజితుండై , కనకకశిపు డనఁగా వెలసెన్.

209


శా.

ఆరక్షోరమణుండు లోకభయదవ్యాపారుఁడై, బాల్యకౌ
మారంబుల్ గడచన్న యౌవనవయోమత్తాత్ముఁడై, రాజ్య మిం
పారం జేయుచు, నొక్కనాఁడు సచివన్యస్తాత్మసామ్రాజ్యసం
భారుండై, జగదాధిపత్యమహిమం బ్రాపించు చిత్తంబునన్.

210
  1. వులకు - తా
  2. గర్ములకును - తా
  3. దుఃఖమై - మా,క
  4. జన్మావసానంబున - మా,త
  5. దారా - మ,హ,ర
  6. డైయమ - మ,త,క