పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

వరాహపురాణము


సీ.

నవరత్నకాంచనోన్నతసౌధవీథులఁ, | గృతకచింతామణిగిరితటములఁ,
గలితమందాకినీపులినభాగంబుల, | నతులధారాగృహాభ్యంతరముల,
నందచారామమందారకచ్ఛాయల, | సంచితకుసుమశయ్యాతలముల,
వారిజోత్పలసముజ్జ్వలసరోవరముల, | ననుపమస్వర్ణడోలాంతరముల


తే.

వరుసఁ గ్రీడింపుచుండె భూసురవరుండు | దివిజకాంతలు చతు[1]రశీతిప్రభేద
సురతబంధవిశేషవిస్ఫురణఁ దనుప | నిరుపమానందభరితుఁడై, మఱియు నతఁడు.

193


మ.

ప్రమదం బందుచుఁ జూచు నొక్కపుడు రంభానర్తకీరూపిత
భ్రమరీనృత్యవిసార్యమాణవిలసద్బాహాద్వయీమూలభా
గమనోహారిసువర్ణరేణునిభరంగత్కాంతిసందోహవి
భ్రమణోత్పన్నతటిల్లతావలయసౌభాగ్యంబుల న్నిచ్చలున్.

194


సీ.

అంగనాధరసుధాహారసంతృప్తుఁడై | యమృతాంధసుం డౌట నభి[2]నయించు,
రామావిలోకనప్రస్తనిమేషవి | తానుఁడై యనిమిషత్వము భజించు,
వ్రీడావతీరతిక్రీడా[3]వినిద్రుఁడై | యస్వప్నభావంబు నర్థిఁ దాల్చుఁ,
దరుణీపయోధరోత్సంగ[4]విహారియై | ఖేచరత్వంబు నంగీకరించు,


తే.

దివ్యభోగానుభవములఁ దేజరిలుచు | నతులితానందముల సుపర్వత వహించు,
మదనభూతంబు సోఁకినమత్తుఁ డగుచుఁ, | బరిహృతాన్యవిచారుఁడై బ్రాహ్మణుండు.

195


ఉ.

భూవిబుధోత్తముం డిటుల పూర్వమనోభవకేళితత్పరుం
డై విహరింప, నేకదివసాకృతి దివ్యసహస్రవర్షముల్
పోవుటయున్, బరేతపతి బుద్ధి నెఱింగి, భయంకరాత్మభృ
త్యావళిఁ బంచె, బ్రాహ్మణకులాగ్రణిపాలికి నాక్షణంబునన్.

196


దుస్తరనరకయాతనానుభవము

వ.

ఇట్లు పనిచినఁ గాలకింకరులు భయంకరులై సురపురికి నరిగి, త్రిదశసుదతీమధ్య
మంబున మదనకదన[5]క్రియాపరవశుఁడై కాలంబుపోక కడగానకయున్న విష్ణువర్ధనుని
బలాత్కారంబునఁ బట్టుకొని వచ్చి, సమవర్తి కట్టెదురం బెట్టిన, నావిప్రవరు నాలోకించి దండ
ధరుం డిట్లనియె.

197
  1. ర చౌసీతి (యతి?) - మ,మా
  2. నుతించు-మా
  3. వినీంద్రుఁడై - మ,మా,తా,తి,తీ,హ,రక
  4. విహారుఁడై - తా,క
  5. క్రీడా - క