పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

93


వ.

అనిన విష్ణువర్ధనునకుఁ గృతాంతుం డిట్లనియె.

185


సీ.

వసుధామరేంద్ర! నీ వలనఁ బాపంబులు | లేవు, నీ వాజన్మపావనుఁడవు,
హరిపదధ్యానతత్పరుఁడవు, దేవతా | పూజితుండవు, నిత్యపుణ్యమతివి,
వనితమూలమ్మున వచ్చిన పాతకం | బనుభావ్యమగుఁ బతి కర్ధభాగ,
మట్లు గావున నేరికైన దుష్కర్మంబు | లనుభవంబునఁ గాని యణఁగిపోవు,


తే.

హరికి సత్కర్మ మర్పితం [1]బయ్యుఁగాని, | కలుషసంఘంబు చెడిపోక నిలిచియుండు,
[2]నందు సత్పాత్రదానాదులైన సుకృత | కర్మములు సేయ నణఁగు భాగత్రయంబు.

186


ఆ.

అనుభవైకనాశ్య మాచతుర్థాంశంబు | పద్మజాదిదివిజపటలికైన,
గాన ననుభవింపు కాంతాకృతాఘంబు | నందుఁ బాదభాగ మనఘ! యనుచు.

187


క.

అంతకుఁ డి ట్లమరసభా | భ్యంతరమునఁ బలికె, నంత నావిప్రుఁడు దు
ర్దాంతఘనశోకసంభవ | చింతాభారమున [3]నుబ్బసిల్లుచుఁ బలికెన్.

188


ఆ.

పుణ్య మనుభవించి, భూలోకమునఁ బుట్టఁ | జనెడునపుడు పాపచరమభాగ
మనుభవింతుఁ గాని, యాదిన నరకాను | భవ మొనర్పఁజాల దివిజముఖ్య!

189


సురలోకసుఖానుభూతి

వ.

అనిన విని యనిమిషాధ్యక్షుం డనుకంపాసంపన్నాక్షుం డగుచు, రంభాముఖ బర్హిర్ముఖ
జంద్రముఖులం గనుంగొని యిట్లనియె.

190


చ.

ఇతఁడు మహానుభావుఁడు, మహీసుర[4]1వర్యుఁడు, విష్ణుభక్తిసం
యుతుఁ, డదిగావున న్మరకతోపలనిర్మితభర్మహర్మ్యశో
భితమృదుశయ్యలందు, రతిభేదములం గరఁగించి, [5]తావకా
ద్భుతచరితంబుచే నుబుసుపుచ్చుఁడు మీరు సహస్రవర్షముల్.

190


క.

అని పలికిన దేవేంద్రుని | పనుపు శిరోవీథిమాల్యభావంబునఁ గై
కొని, యాయమరాంగన లా | ఘనుఁ దోడ్కొని యరిగి రాత్మఁగౌతుక మొదవన్.

191


వ.

ఇట్లరిగి.

192
  1. బయ్యెఁగాని - మ,త,తా,తి,తీ,హ,ర,క
  2. నందుసత్పాత్ర - పటలికైన తి. ప.లో లుప్తము.
  3. నుల్లసిల్లుచు - క
  4. ముఖ్యుఁడు - క
  5. వీనికద్భుత - మ,మా,త,తీ,హ,ర,క