పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

91


తే.

పాప మున్నది, యందు సాఁబాలు నిన్నుఁ | దగులుఁ, గావున నిరయ సద్మంబులోన
యాతనాదేహగతుఁడవై యబ్దమాత్ర | మనుభవింపంగఁ నగు నీకు నాఫలంబు.

172


ఉ.

రౌరవముఖ్యనారకపరంపరలం దనుభూతపాపసం
భారుఁడవై , సురేంద్రపురిఁ బ్రాహీనపుణ్యఫలంబు గాంచి, యా
ధారుణిఁ గొన్నియజ్ఞములు దర్పితజంబుకమూ ర్తివై, తదా
కారము నుజ్జగించి, మరి కాంతువు విష్ణుపురీవిహారమున్.

173


చ.

తరుణి యొనర్చునట్టి దురితంబుల నర్ధము భర్తఁజేరుఁ ద
త్పురుషుఁడు సేయునట్టి ఘనపుణ్యములోన సగంబు భామినిం
బొరయుచునుండు, నీద్వివిధమున్ శ్రుతిమూలముగా నెఱుంగు భూ
సురవర! యంచుఁ బల్కు రవిసూనున కిట్లనుఁ గంపితాత్ముఁడై.

174


ఆ.

ప్రాప్తయాతనుండ నై యేను దుఃఖాను | భవముచేతఁ గుంది భానుతనయ!
[1]మీఁద నెట్లు నిర్గమింతు భయంకరా | కారనిరయశోకకాననంబు?

175


వ.

అని పలికిన విప్రవరునకు దండధరుం డిట్లనియె.

176


ఉ.

భూసురుఁ డొక్కరుండు, కృతపుణ్యుఁడు, తొల్లి మహేంద్రకీలశై
లాసమసానుదేశమున నంబుజనాభునిగూర్చి మారుతా
భ్యాసపురస్సరంబుగ భయంకరతీవ్రతపం బొనర్చెఁ, బ
ద్మాసనముఖ్యదేవతలు నద్భుత మందుచునుండ నత్తఱిన్.

177


సీ.

జనని యెవ్వని నాభివనజాతకర్ణిక | భూతభవద్భావిధాతృతతికి?
సూచకం బెవ్వని లోచనద్వయ మహో | రాత్రాదికాలసంరంభమునకు?
మామ యెవ్వని పాదతామరసాగ్రంబు | [2]వరరత్నసంపన్నవార్ధిపతికి?
నాధార మెవ్వని యసమానతల్పంబు | చక్రవాళాంతభూచక్రమునకు?


తే.

నుద్భవస్థాన మెవ్వని యుదరశుక్తి | పద్మగర్భాండమౌక్తికపటలమునకు?
నమ్మహాత్ముఁడు లక్ష్మీసహాయుఁ డగుచు | ధరణిసురశేఖరునకుఁ బ్రత్యక్షమయ్యె.

178


వ.

ఇవ్విధంబున సాక్షాతరించిన లక్ష్మీకాంతుం డతని కిట్లనియె.

179
  1. యెట్లుమీఁద నిర్గమింతు - త
  2. నవరత్న (యతి?) - మా