పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

87


శా.

[1]యాదృగ్జంతువు గర్భకోటరము మున్నర్థిం బ్రవేశించి, తాఁ
దాదృగ్గాత్రభరంబు దాల్చి వెడలుం దద్యోనిమార్గంబునన్,
బ్రాదుర్భావనిదానభూరిజవశుంభత్సూతివాతచ్చటా
భేదోత్పాదితవేదనాభరమహాభీతిం బ్రకంపించుచున్.

144


ఉ.

ఈగతి జీవుఁ డెంతయును హేయతరంబగు మాతృగర్భకా
రాగృహవీథి వెల్వడి, నిరంతరబాహ్యసమీరణాహతిం
బ్రాగవబోధము న్మఱచి, బాలకుఁడై చరియించి, యౌవనా
భోగముఁ జెంది, రూపబలభోగధనాదులచేత మత్తుఁడై.

145


క.

గురుదేవద్విజనిందా | పరుఁడై, నిమిషమును విష్ణుపాదాంభోజ
స్మరణ మొనర్పఁగ నేరక | తిరుగం జనుచుండు దుర్గతికి జడమతియై.

146


సీ.

ఈరీతి నరులు దేహేంద్రియసంజాత | కామాదిగుణములఁ గట్టువడుచు,
బహువిధజన్మసంభావితకర్మాను | రూపసంపన్మదారూఢు లగుచు,
నర్థదారాదిమోహవ్యాప్తి నస్థిరం | బగు జీవనంబు నిత్యమని నమ్మి,
విపులలోభమ్మున విత్త ముపార్జించి | సత్పాత్రదానంబు జరుపలేక,


తే.

ముక్తిసంప్రాప్తికరధర్మమోదశూన్యు | లగుచు, నటమీఁద బహువేదనాతినిబిడ
యాతనాదేహములు దాల్చి, యమితదుఃఖ | మనుభవింతురు నరకకూపాంతరముల.

147


వ.

అది గావున.

148


సీ.

త్వఙ్మాంససంధిబంధముల పట్టువదల్చి, | దంతకోరకముల ధరణిఁ గూల్చి,
నేత్రవీక్షణశక్తి నిశ్శేషముగఁ ద్రించి, | శ్రవణప్రభావంబు సంహరించి,
జిహ్వావచోవృత్తి శిథిలత నొందించి, | ఘ్రాణగంధజ్ఞానగరి[2]మ డించి,
హృదయసామర్థ్యంబు మొదలికిఁ బోకార్చి, | తనువుఁగంపమునకు దాపొనర్చి,


తే.

పలితరోగాదివికృతిసంవలితుఁ జేసి | ఘనజరాకాళరాత్రి మ్రింగకయమున్న,
నరుఁడు హరి[3]నామజపకళానిరతుఁ డగుచుఁ | బరమపదసౌఖ్య మనుభవింపంగవలయు.

149


వ.

అని చెప్పి, వెండియుం బుండరీకభవుండు నారదున కిట్లనియె.

150
  1. ఈ ప. మ,తి,తీ,హ,ర,క ప్ర.లో లుప్తము
  2. మడంచి - తి,హ,ర
  3. జపసత్కళా - మ,తా,హ,ర,క; జపసత్కథా - తి