పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

వరాహపురాణము


క.

హరిమూర్తులలో నెయ్యది | పరిచితమగు, నట్టిమూర్తి భావింపఁదగున్,
బరమూర్తిఁ దలఁచెనేనియుఁ | బురుషుఁడు విఘ్నములఁ బొందు, బుద్ధి చలింపన్.

137


క.

హరి[1]కీర్తనమాత్రమునం | బరమపదం [2]బొదవు ననుచు బలభిన్ముఖ్యా
మరులు మదిఁ గోరుచుందురు | ధరపైఁ గలియుగమునందుఁ దారు జనింపన్.

138


ఉ.

దారకుమారమిత్రజనతాఫణిసంకుల, మవ్యయస్పృహా
భూరితరాంధకారమధుపుంజతృణావరణంబునైన సం
సారపురాణకూపమున జాఱినమర్త్యుఁడు, విష్ణుకీర్తనో
దారసురజ్జుమార్గమునఁ దా వెడలం దగు బుద్ధిమంతుఁడై.

139


సీ.

నిజ[3]పూర్వభవకర్మనియత[4]యోనిసహస్ర | జాతుఁడై జీవుండు భూతధాత్రి
గ్రమమున మానవాకారుఁడై యుదయించి, | పరమవైష్ణవమార్గ మెఱుఁగలేక,
పరసతీవ్యసనుఁడై పరవిత్తహరణంబు | సేయుచు, విద్యావిశిష్టులైన
బుధుల నిందింపుచుఁ బుణ్యంబు దిగనాడి, | దానం బొనర్పక ధర్మ ముడిగి,


తే.

గురుకృపాదృష్టిదూరుఁడై కుమతి యగుచు | నర్థకాంతాసుతాదిమోహంబుకతనఁ
జాల గర్వించి, యవసానకాలమునను ! యాతనాదేహియై పోయి యమపురమున.

140


సీ.

తప్యమానానలతప్తుఁడై, యసిపత్ర | వనఖండితాంగుఁడై శునకవక్త్ర
కబళితుండై , గృధ్రకాకసందష్టుఁడై, | లోహానంబులలోనఁ గూలి,
యతితప్తతైలమధ్యమునఁ ద్రోవఁగఁబడి | బహుకాలపాశనిబద్ధుఁ డగుచు
[5]నధికదుఃఖకరంబు లైన నారకములఁ | దద్గతజంతుబృందములచేతఁ


తే.

బీడితుండయి, యత్యంతభీతిఁ బొంది, | దండధరభటగదశతధావిభిన్న
[6]మూర్ధుఁడై శోకజలధిలో మునిఁగి మునిగి, | [7]యనదయై దిక్కుగానక పనవి పనవి.

141


క.

ఈరీతి సకలభయదమ | హారౌరవరౌరవాదికానేకోద్య
న్నారకకూపాంతరముల | దారుణబాధా[8]విశీర్ణతరవిగ్రహుఁడై.

142


క.

[9]అంతట నిజకర్ణానుభ | వాంతంబునఁ దత్ప్రతిష్ఠమగు గర్భగుహా
భ్యంతరముఁ జొచ్చి జననీ | సంతతవిణ్మూత్రవిహిత[10]సర్వాంగుండై.

143
  1. చింతన - తీ
  2. బబ్బు - మా,త
  3. యోగ - తీ
  4. యోగ - మ,తి,తీ,హ,ర,క
  5. నధిక - నారకముల తి,హ,ర, ప్ర. లో లుప్తము; రక్తమేదోమాంససిక్తకూపంబున దుర్గంధమగ్నుఁడై దొర్లి దొర్లి తద్గతంబగుజంతు - తీ
  6. మూర్ఖుఁడై - అన్ని ప్ర.
  7. ఈ పాదము తా.ప్ర.లో మాత్రమున్నది.
  8. వికీర్ణ - త; వితీర్ణ - క
  9. ఈ ప. ఆ.ప్ర. లో లుప్తము
  10. సర్వాంగకుఁడై - మా