పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

వరాహపురాణము


తే.

తస్కరునిచొప్పు, విష్ణుదూతలవిధంబు, | నాత్మభృత్యులు కుంఠితులైన తెఱఁగు
విన్నవించిన, నిందిరావిభుఁడు నవ్వి, | యాదరంబున యముని కిట్లనుచుఁ బలికె.

126


శా.

సాలగ్రామశిలాభిషిక్తసలిలాస్వాదక్రియాభీలం దం
భోళిధ్వస్తసమస్తదోషగిరియై, పుణ్యాగ్రగణ్యాత్ముఁడై
కేళి న్మత్పురి కేగుదెంచె దివిజుల్ గీర్తింప జోరుండు, నీ
వేలా దీనికి నుమ్మలించెద[1]వు నేఁ డీరీతి వైవస్వతా!

127


వ.

ఇంక నొక్కరహస్యంబు చెప్పెద నాకర్ణింపుము.

128


సీ.

మత్పాదపూజాసమాహితులగువారి, | మత్తీర్థములు గ్రోలి మసలువారి,
మదభీష్టకైంకర్యముదితాత్ములగువారి | మదుద్ధ్యానమున మేను మఱచువారి,
మద్భక్తజనదత్తమమకారులగువారి, | మత్కర్మనిరతులై మనెడువారి,
మన్మారసౌఖ్యంబు మరిగి పాయనివారి, | మత్క్రతుక్రియల నేమఱనివారి,


తే.

శౌర్యమునకైనఁ, గృతవిశేషమునకైనఁ, | దవిలి మచ్చిహ్నములు మేనఁ దాల్చువారిఁ
గరుణఁ జేపట్టి వైకుంఠపురికిఁ జేర్చి, | ప్రాణతుల్యులుగాఁ జూతు భానుతనయ!

129


ఉ.

కావున నీకు నొక్కహితకార్యముఁ జెప్పెద నింతనుండి మ
త్సేవకమందిరంబులకుఁ జేరితివేనియుఁ గాఁక వచ్చుజు
మ్మీ! వలదంచు [2]సౌరి నియమించి తిరోహతమూర్తి యయ్యె ల
క్ష్మీవరుఁ, డంతకుండు నరిగెన్ బలభేదియుఁ దాను గ్రమ్మఱన్.

130


వ.

అది కావున, బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రాదివర్ణజాతులును, [3]బ్రహ్మచర్యగృహస్థ
వానప్రస్థయత్యాశ్రమసమేతులును, నిజపూజాయోగ్యస్ఫూర్తులకు సాలగ్రామశ్రీమూర్తుల
నిత్యసన్నిహితుండగు రమాసహితుని నారాధింపవలయును.

131


హరినామసంకీర్తనప్రాశస్త్యము

క.

యుగములు నాల్గిటిలోఁ గలి | యుగమునఁ గల దొక్కసుగుణ [4]మోహో! మనుజుం
డగణితపాతకుఁ డయ్యును | సుగతికిఁ జను విష్ణుకథలు [5]సొంపుగ వినినన్.

132
  1. విటెంతే భీతి - తీ
  2. శౌరి - అన్ని ప్ర.
  3. బ్రహ్మచర్యాద్యాశ్రమ - తా
  4. మొప్పుగ మనుజుం - త; యుత్తమమనుజుం డగణిత - హ; మూహింప నరుం - క
  5. నొప్పుగ (యతి?) - మ,ర