పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

వరాహపురాణము


క.

పృథు[1]వక్త్రమై, సుచక్ర | ప్రథితంబగు నృహరిమూర్తి, పరులకుఁ బూజా
గ్రథన మొనరింపరా, ద | శ్లథమానసుఁడైన బ్రహ్మచారికిఁ [2]దక్కన్.

93


తే.

పంచబిందుకకపిలంబు, భాసురత్రి | బిందుయుతనారసింహంబు పృథుతరప్ర
యత్నమునఁ బూజ యొనరించు నర్చకులకు | నపునరావృత్తి ముక్తిదాయకము లనఘ!

94


తే.

శక్తిలింగక మనఁగ దంష్ట్రాఖురాది | కములు గైకొని, విషమచక్రములు దాల్చి
సేవకాభీష్టదానప్రసిద్ధ మగుచుఁ | దనరునది [3]కోలమూర్తి సజ్జనవరేణ్య!

95


క.

స్థూలంబై, [4]వాసవమణి | నీలంబై, విబుధవర్ణనీయంబై, రే
ఖాలాంఛనత్రయంబై | క్రాలెడునది కూర్మమూర్తి గౌరవనిలయా!

96


తే.

హరితవర్ణాంకితము కౌస్తుభాభిశోభి | తంబునై మించి, [5]చరమభాగంబునందు
వర్తులంబైనయట్టి యావర్త మొకటి | యమరఁ గైకొన్న యదియ యనంతమూర్తి.

97


క.

ఎంచఁగ నంకుశరేఖా | పంచకమునఁ గలితమగుచు బహుబిందుకమై
మించి, నలుపైనయది వివ | రించ హయగ్రీవమూర్తి ఋషికులతిలకా!

98


క.

ఏకసు[6]చక్రము మణి[7]రే | ఖైకము, నంబుజయుతంబు ఘంటారేఖా
శ్రీకలితద్వారమునై, | ప్రాకటవైకుంఠమూర్తి భాసిలు ననఘా!

99


చ.

లలితకదంబపుష్పరుచిలక్షితమై, వనమాలికాసము
జ్జ్వలమయి, రేఖ లైదు చెలువంబుగఁ గైకొని, రాజ్యసంపదం
జెలఁగి యొసంగఁజాలునది శ్రీధరమూర్తి యనంగ నొప్పు; వ
ర్తులతయు, హ్రస్వభావమును రూఢిగ వామనమూర్తి చిహ్నముల్.

100


క.

అతసీనూతనకుసుమ | ద్యుతియును, విస్పష్టబిందుయోగము, రమ్యా
కృతియుఁ, ద్రివిక్రమమూర్తికి | శ్రుతిభాషితచిహ్నములు యశోధనవర్యా!

101


తే.

చక్రములు రెండు వామపార్శ్వమునఁ గలిగి, | దక్షిణంబున నొకరేఖ తనరఁ బూని,
వర్ణములు రేఖలును బెక్కువరుస మేన | నమరఁ గైకొన్న యదియు ననంతమూర్తి.

102


క.

నీరదవర్ణము, దీర్ఘా | కారంబును, సూక్ష్మచక్రకము, బహురంధ్రా
ధారమునై చూపట్టిన | నారయఁ బ్రద్యుమ్నమూర్తి యన విలసిల్లున్.

103


తే.

తాళలాంగూలచిహ్నముల్ దాల్చినట్టి | యదియుఁ బ్రద్యుమ్నమూర్తియ యనఁగఁ బరఁగు
రక్తవర్ణము దీర్ఘచక్రములు నంక | ములుగ సంకర్షణా[8]ఖ్యానమూర్తి తనరు.

104
  1. చక్రమై - మా
  2. గణకన్ - క
  3. క్రోడ - క
  4. వామన - మ,మా,త,తి,తీ,హ,ర,క
  5. చతుర - మ,తి,హ,ర,క
  6. రేఖము - క
  7. రేఖాంకము (ప్రాస?) - అన్ని ప్ర.
  8. ణ ధ్యాన - మ,తా,తి,తీ,హా,ర,క