పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

79


క.

కావున భక్తిసమేతుం | డై, విప్రుఁడు నిజకులోచితాచారపరుం
డై, వరసాలగ్రామ | శ్రీవల్లభమూర్తిఁబూజ సేయఁగవలయున్.

85


క.

ప్రతిదినమును శ్రీమూర్తి | స్థితతీర్థము గ్రోలునట్టి ధీరుఁడు, పితృసం
యుతుఁడై హరిభవనంబున | వితతానందంబు ననుభవింపుచు నుండున్.

86


వ.

అట్టి సాలగ్రామంబులయందు గుణసమేతంబులగు కొన్ని మూర్తిభేదంబుల నాది
వరాహంబు భూదేవి కెఱింగించె. తత్క్రమంబు వినుము. వాసుదేవానిరుద్ధ నారాయణ
పరమేష్ఠి కపిల నారసింహ వరాహ కూర్మానంత హయగ్రీవ వైకుంఠ శ్రీధర వామన
ప్రద్యుమ్న సంకర్షణ చక్రనాభి మత్స్యో గ్రనారసింహ పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ జనార్దన
లక్ష్మీనారాయణ దధివామనంబులు పూజాయోగ్యంబులు. వీనియందు సంకర్షణమూర్తి
క్షత్రియులకుఁ, బ్రద్యుమ్నమూర్తి వైశ్యులకు, ననిరుద్ధమూర్తి శూద్రులకును గరస్పర్శన
పూర్వకంబుగాఁ బూజనీయంబులు. మఱియుం బూర్వోక్తమూర్తిభేదంబులయం [1]దతిశ్యామ
లంబు రోగకరంబును, గృష్ణవర్ణంబు కీర్తికరంబును, బీతవర్ణంబు ధనకరంబును, నీలవర్ణంబు
లక్ష్మీప్రాప్తికరంబును, బాండువర్ణంబు సంపన్నాశకరంబును, రక్తవర్ణంబు రాజ్యకరంబును,
గపిలవర్ణంబు పత్నీహానికరంబును నగు. వీని లక్షణంబులు వివరించెద. ఆకర్ణింపుము.

87


క.

ద్వారంబున సమచక్రము | లారయఁ గనుపట్టి ధవళమై [2]శుభదంబై
మీఱునది వాసుదేవ మ | నో[3]రమమూర్తి యన వెలయు నుతగుణనిలయా!

88


ఆ.

వెనుకవంకఁ బద్మమును, వక్త్రసీమరే | ఖాత్రయంబు పీతకాంతి[4]భరము
గలిగి, వృత్తమగుచుఁ గనుపట్టునది యని | రుద్ధమూర్తిగా నెఱుంగవలయు.

89


ఉ.

ఆయత[5]కాంతిపుంజసముదంచితమై, ఘననీలనీరద
చ్చాయఁ దనర్చి, వామగతచక్రయుగంబును, దక్షిణాంగరే
ఖాయుతమున్ శుభప్రదముఖంబునునై చెలువొందెనేని, నా
రాయణమూర్తిగా నెఱుఁగు, రాజితభక్తిపురస్సరంబుగన్.

90


క.

అతిశోభనమై, రేఖా | యతనంబై , పద్మచిహ్నమై, వృత్తనిజా
కృతియై చూపట్టిన, నా | యతమతి పరమేష్ఠిమూర్తి యని తెలియఁదగున్.

91


క.

[6]స్థూలతరచక్రయుగళము | నీలఘనద్యుతియుఁ గలిగి [7]నిరతగదారే
ఖాలంకృతమధ్యమ [8]మనఁ | జాలినయది కపిలమూర్తి సన్మునివర్యా!

92
  1. శ్యామంబు - మా,త,క
  2. సుభగంబై - త
  3. హర (ప్రాస?) - మా
  4. రసము - మ,మా; తరము - తా
  5. నీలకాంతిసము - తీ
  6. తి, తీ ప్ర. లో ఈ ప, తరువాతి (93) ప. అసమగ్రము.
  7. నిరతముగదరే - త
  8. మున - మ,మా,తా,తి,తీ,హ,ర,క