పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

77


క.

పావనసాలగ్రామశి | లావిధిఁ దాఁ బాయకుండు లక్ష్మీరమణుం
డావిమలోపలమున హరి | కావాహనవిధి యొనర్చు [1]టనుచిత మనఘా!

69


వ.

అనిన యాశారదాభర్తకు నారదుం డిట్లనియె.

70


క.

సాలగ్రామవిశిష్టశి | లాలక్షణ మెద్ది? యందు లక్ష్మీరమణుం
డేలీలఁ బాయకుండును? | బోలఁగ నా కానతిమ్ము భువనస్తుత్యా!

71


ఉ.

నావుడు పద్మసంభవుఁడు నారదసంయమి కిట్లనున్, మహీ
దేవికిఁ [2]గోలమూర్తి యగు దేవుఁడు మున్నెఱిఁగించెఁ, [3]దచ్ఛిలా
పావనలక్షణక్రమము భక్తి దలిర్పఁగ నీకు నాతెఱం
గే వివ[4]రింతు, విన్ము భవదీరితపృచ్ఛకు నుత్తరంబగున్.

72


పావనసాలగ్రామమాహాత్మ్యము

క.

హిమశైలగండకీమ | ధ్యమభాగము[5]నందు యోజనాయతవిస్తా
రమనోజ్ఞంబై కలదొక | యమలక్షేత్రంబు హరికి [6]నాశ్రయ మగుచున్.

73


క.

అన్నెలవునఁ బొడమినశిల | లన్ని యుఁ జక్రాంకితంబులై శుభదములై
సన్నుతి కెక్కుచునుండుఁ బ్ర | సన్నరుచిస్ఫురణ గలిగి సంయమివర్యా!

74


చ.

అనుపమపుణ్య[7]శీల! విను మద్భుత మచ్చటఁ బెద్దనిద్రకున్
గనుగవమూసెనేని కృతకల్మషుఁడైనను, శంఖచక్రసా
ధనములు బాహుదండములఁ దాల్చి జగజ్జనవందనీయుఁడై
తనరుచు, శ్రీహరిం గలయుఁ దత్క్షణమంద, యమందవైఖరిన్.

75


క.

శ్రీమత్పుణ్యాకర నిజ | నామంబై, ముక్తికారణంబై, తద్ధా
త్రీమండలంబు సాల | గ్రామక్షేత్రం బనాఁగ గణనకు నెక్కున్.

76


క.

అచ్చో నుదయించినశిల | నచ్చుగఁ బూజించునట్టి యనఘాత్ముఁడు పా
పోచ్చయ[8]విరహితుఁడై తుద | [9]విచ్చలవిడి విష్ణులోకవిభవముఁ జెందున్.

77
  1. టర్హంబనఘా - తీ
  2. గ్రోడ - క
  3. దాశిలా - తి,తీ
  4. రించెదన్విను త్వదీయపుఁబ్రశ్నకు - తీ
  5. నంటి - త
  6. నాశ్రమ - తి,తీ
  7. కర్మ - మ,తా,తి,తీ,హ,ర,క
  8. భయవిరహితుఁడయి - త,మ,హ; మున విరహి - తీ; విరహితుఁ డగుచును - తా
  9. విచ్చనవిడి - అన్ని ప్ర.