పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

75


ఆ.

క్రయము, విక్రయంబు, ద్రవ్యార్జనము, విప్ర | భక్తి, కరుణ, లాభపాటవంబు,
స్నానదాననియమభూనుతాచారంబు | లరయ వైశ్య[1]జాతి కర్హవిధులు.

52


క.

నలినోదర భూసుర నిశ్చలభక్తియు, స్వామిహితము శౌర్యము, రిపురా
డ్బలభేదనచాతుర్యము, |దలపోయఁగ శూద్ర[2]విహితధర్మము లనఘా!

53


విప్రుల విశిష్టధర్మములు

తే.

ఇట్టివర్ణంబులందు మహీసురుండు | సర్వకర్మసమాచారచతురుఁ డగుచుఁ
బావనము సేయు నిజపాదపద్మరేణు | ఖండసంయోగమున ధరా[3]మండలంబు.

54


క.

పదపంకజస్థలంబున | నదులును, గరములను వహ్ని, నగవుల సిరియున్,
హృదయంబునఁ బరమాత్మయు | విదితంబుగఁ బాయకుండు విప్రులకెల్లన్.

55


క.

జననంబున శూద్రునిక్రియ | జనియించి, విశిష్టకర్మసంస్కారవశం
బున గళితకల్మషుండై | మనుజుఁడు విప్రత్వ మొందు మౌనివరేణ్యా!

56


సీ.

పూర్వజన్మార్జితపుణ్యాతిశయమున | విప్రవంశమున నావిర్భవించి,
జాతకర్మాదిసంస్కారసంయుక్తుఁడై | యనుపమయోగవిఖ్యాతుఁ డగుచు,
దేశికోత్తమసమాదిష్టమార్గమున భి | క్షాభోజియై జటాచ్ఛటలు దాల్చి,
దండాజినంబులు ధరియించి మేఖలా | కౌపీనసహితుఁడై [4]కోపముడిగి,


తే.

విమలచేతస్కుఁడై వేదవేది యగుచు, | బ్రహచర్యంబు [5]2చరియించి పరమనియతి
నావ్రతాంతంబునను గృహస్థాశ్రమంబు | స్వీకరింపంగవలయు, నుర్వీసురేంద్ర!

57


క.

సమవంశజాతకన్యక | నమితగుణాదారఁ బెండ్లియై, గేహస్థా
శ్రమమున నుండిన విప్రుఁడు | సముచితకృత్యముల నిత్యసంతుష్టుండై.

58


మ.

కమలాక్షార్చనశాలియై, యతిథిసత్కారంబు గావించి, యు
త్తమసాద్వీమణియందు [6]నందనుల నుత్పాదించి, వర్గత్రయ
క్రమసౌఖ్యంబులు చెంది, యా వెనుక మోక్షప్రాప్తికి న్మూలకం
ద మనన్మించిన యోగముం దెలిసి, వానప్రస్థసన్మార్గమున్.

59


క.

కూరిమిఁ గైకొని, ధనసుత | దారాదులయందు నిర్గతస్పృహుఁడై, కాం
తార[7]మునఁ గందమూలా | హారంబులచేతఁ దృప్తుఁడై యటమీఁదన్.

60
  1. వరుల - తీ
  2. జాతి - క
  3. మండలమున - మ,మా,త,తా,తి,క
  4. కోపముడిగి విమలచేతస్కుఁడై - ఈభాగము మ, త, తి,హ,ర ప్ర. లో లుప్తము; ఘనత మెఱయ నాదరం బొప్పఁగా - మా
  5. భజియించి - తీ; నియమించి - ర: ధరియించి - తి
  6. నుత్తముల - మా
  7. భవకంద - మా,త; ఫలకంద - తీ