పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

వరాహపురాణము


క.

ఆకళ లిరువది గూడ శు | భాకర! యరగడియ యయ్యె నవి రెండు మహీ
లోకమున ఘటిక యనుచు వి | వేకించిరి గణితశాస్త్రవిద్యా[1]చరితుల్.

45


సీ.

అవి రెండు గూడిన నగు ముహూర్తము, ముహూ | ర్తములు ముప్పది దివారాత్ర మయ్యెఁ,
బదియేను దినములు పక్షంబు, పక్షద్వ | యంబు మాసం, బది యాఱుఁ గూడ
నయనమై పరఁగు, నాయయనయుగ్మముఁ గూర్ప | వత్సరంబగు, నట్టి వర్షశతము
లురవడిఁ బది గూడ నొక సహస్రంబగుఁ, | జర్చింప శతసహస్రములు లక్ష


తే.

యరయ లక్షలు పదిపదు - లైనఁ గోటి, | యట్టి కోటులు ధర నేఁబదైన నాకు
నర్ధయామము, విను [2]మంతనంత నృపతు | లస్తమింతురు [3]కాలసంగ్రస్తు లగుచు.

46


క.

రవి గమనాగమనంబులఁ | బ్రవిమలమానసులు కాలపరిణామంబున్
వివరింతురు, తద్విరహిత | మవునేనియుఁ దెలియ దస్మదాదులకైనన్.

47


క.

నాళీకాసన దివిష | త్పాలక నృపముఖులు కాలపరిభూతులు, త
త్కాలమును గెలువ నోపఁడు | కాలాత్మకుఁడైనయట్టి కమలాధవుఁడున్.

48


వ.

ఇట్టికాలంబు కృతత్రేతాద్వాపరకలియుగాదిభేదంబులం బ్రవర్తించు.ఆయుగం
బులయందు జనులు స్వకులాచారసంయుక్తులై బహ్మక్షత్రియవైశ్యశూద్ర రూపంబులఁ
జతుర్విధంబులై యుందురు. అందు నగ్రగణ్యులైన భూసురులు [4]బ్రహ్మచారిగృహస్థవాన
ప్రస్థయతిభేదంబుల నాలుగుతెఱంగులైరి. ఇంక బ్రాహ్మణజాతీయధర్మంబు లెట్టివనిన.

48


చాతుర్వర్ణ్యధర్మములు

సీ.

స్నానంబు వేద మార్జవ [5]మమాత్సర్యంబు | దానం బహింస నిస్తంద్రభావ
మతిథిసత్కారంబు లగ్నిహోత్రంబులు | సంధ్యాదికృత్యముల్ [6]సర్వసమత
హరిచింతనము సంతతాచార మక్రోధ | మాస్తిక్య మమృతవాక్యప్రచార
మాదిత్య[7]సేవ యోగారూఢభావంబు | పైతృకాచరణంబు భావశుద్ధి


తే.

భాగవతభక్తి కామాదిభంజనంబు | దయయు దాక్షిణ్య మఖిలశాస్త్రార్థదృష్టి
ప్రాజ్ఞసంగతి సాధువర్తన ముముక్ష | యనఁగ, నివి విప్రధర్మంబు లనఘచరిత!

50


చ.

హరిపదభక్తియున్, దయయు, నాహవమున్, రిపుభేదనంబు, సు
స్థిరహృదయత్వమున్, [8]విబుధసేవయు, దానము, రాజ్యపాలనా
భిరతియు, సింధురాశ్వరథభృత్యసముద్ధరణంబు, నీతిసం
చరణము, మంత్రగోపన విచారము నా నివి రాజధర్మముల్.

51
  1. చతురుల్ (?)
  2. మందనంత - మ,మా,తా,తి,ర,క; ముపైనంత - తీ; మరిదనంత - హ
  3. రోగ - తీ
  4. బ్రహ్మచర్య - త
  5. మహత్సత్యంబు - తీ
  6. సరవి - తా
  7. శివయోగ మారూఢ - త
  8. విజన - తీ