పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

73

మోక్షప్రదమగు భాగవతధర్మనిరూపణము

ఆ.

వనజనాభ! భాగవత ధర్మ మెయ్యది? | [1]వలయు చిహ్న [2]మెద్ది వైష్ణవులకు?
మనుజుఁ డేమిమూలమున ముక్తిఁ బ్రాపించు? | నానతిమ్ము వీని నాదరమున.

36


వ.

అని పలికిన భూదేవికి భూదారవల్లభుం డిట్లనియె - నని రోమశుండు మార్కండేయుం
గనుంగొని.

37


తే.

[3]కర్మభూమి సమస్తలోకములయందు | వసుధ, యాధాత్రిపై భాగవతవిశిష్ట
ధర్మ మబ్జాక్షచరణపద్మ[4]స్తవంబ, | యది యొనర్చిన నరుఁడు తత్పదము గాంచు.

38


క.

[5]నిర్మలబుద్ధులు, సుజనులు, | ధర్మజ్ఞులు, [6]సత్యరతులు దానాఢ్యులు, స
త్కర్ములు, నరయఁగ వైష్ణవు | లర్మిలిఁ బొందుదురు వీరు హరిమందిరమున్.

39


క.

హరికి సమర్పితములుగాఁ | బురుషుఁడు కర్మము లొనర్చి పునరావృత్తిం
బొరయక, వైకుంఠమహా | పురమున సుఖముండు దివిజపూజ్యుం డగుచున్.

40


కాలస్వరూపము

ఉ.

అక్షయపుణ్యమూర్తి, విభుఁ, [7]డాద్యుఁడు, సర్వ[8]విదుండు, పుండరీ
కాక్షుఁడు విశ్వమింతయుఁ బ్రియంబున మున్ను సృజించి, మీఁదటం
గుక్షిగతంబుగా మెసఁగు గొబ్బున స్వీకృతకాల[9]రూపుఁడై
దక్షత నూర్ణనాభము విధంబునఁ దద్భువనప్రపంచమున్.

41


వ.

కావున సమస్తంబును గాలవశంబుగా నెఱుంగునది యని యాదివరాహంబు భూదే
వికిఁ జెప్పెనని, చతుర్ముఖుండు నారదున కిట్లనియె.

42


ఉ.

వాల [10]వృష ప్రకేతు శుక వజ్ర[11]2గురుండు మహాశ్వకేతు శై
వాల కుశ త్రిలోచన సుపర్ణ రథాశ్వ నృగాది పూర్వభూ
పాలవరేణ్యు లత్యధికబాహుపరాక్రము, లట్టివారుఁ ద
త్కాలముచేతనే తెగిరి గాదె, తలంప మహీసురోత్తమా!

43


ఆ.

వాఁడిసూదిచేత వనజదళంబులు | నూఱు కూడఁబట్టి తూఱఁ బొడుచు
కాల మది క్షణంబు, క్షణములు పది గూడఁ | గాష్ఠ, కాష్ఠ లేడు కళ దలంప.

44
  1. పరమ - తీ; వెలయు (యతి?) - మ,తా,తి,హ,ర,క
  2. లెవ్వి - మా
  3. ధర్మ (యతి?) - మ,మా,త,తి,హ,ర,క
  4. స్తవంబు యది - అన్ని ప్ర.
  5. నిర్మలబుధులున్ - తి,తీ
  6. సుజనరతులు - తి,తీ
  7. డాఢ్యుఁడు - త; డార్యుఁడు - తా
  8. విభుండు - తా,తి,తీ,ర
  9. కూటుఁడై - త
  10. వృషాఖ్య - మ; వృషాభి - తా; వృషావ - తి,తీ,హ,ర
  11. సురుండు - త