పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

వరాహపురాణము


మ.

అని విశ్వక్షితికామినీమణి వరాహాకారుఁడైయున్న శ్రీ
వనితానాథుని, వేదవేద్యునిఁ గృపావార్ధిం బ్రశంసించి, త
ద్ఘనదంష్ట్రామయ[1]దివ్యపీఠమున నుత్సాహంబుతో నిల్చెఁ, బు
ణ్యనదీసాగరతీర్థపర్వతవనీనానార్థసంయుక్తయై.

29


ఉ.

అంబుజనాభుఁ డిట్లు కిటియై ధరణీతల ముద్ధరించి, యిం
ద్రుం బరమానురాగమునఁ దొంటి[2]గతిన్ సురలోకరాజ్యపీ
ఠంబున నిల్పెనంచుఁ బ్రకటంబుగఁ జెప్పిన రోమశున్, సమ
గ్రంబగు భక్తిఁ గన్గొని, మృకండుతనూజుఁడు పల్కె వెండియున్.

30


క.

ఏకర్మము శ్రుతి[3]సమ్మత? | మేకర్మము మోక్ష[4]లబ్ధిహేతువు? దురితం
బేకర్మమువలనం దెగు | నాకర్మము నాకుఁ దెల్పు మార్యలలామా!

31


వ.

[5]అని పల్కిన మార్కేండేయమునీశ్వరునకు రోమశుం డిట్లనియె.

32


క.

నీయడిగిన యీయర్థమె | తోయజభవు నడుగ నారదునకును వాణీ
నాయకుఁడు మున్ను కర్ణర | సాయనముగ నొకటి చెప్పె నది విను మనఘా!

33


నలినాసననారదసంవాదము

సీ.

నారదుం డొకనాఁడు నలినాసనుని పాలి | కరిగి, తద్దివ్యసభాంతరమున
నుచితాసనంబున నుండి, కేలుమొగిడ్చి, | మహనీయ మోక్షధర్మంబు లెవ్వి?
యని ప్రశ్న చేసిన, నఖిలార్థతత్త్వజ్ఞుఁ | డైన వాణీశుఁ డి ట్లనుచుఁ, బలికె,
నాదివరాహదం[6]ష్ట్రాగ్రసంస్థాయిని | యైన భూదేవి తో[7]యరుహనాభుఁ


తే.

బ్రస్తుతింపుచు మోక్షధర్మముల నడుగ | నా మహాపోత్రి ధాత్రికి నాదరమునఁ
దెలిపినట్టి తెఱంగు నేఁ దేటపఱతు | నిరవుమీఱంగ విను మది యెట్టిదనిన.

34


మ.

అసురాగ్రేసరుఁడై తనర్చిన హిరణ్యాక్షుండు హేమాద్రితో
వసుధాచక్రము నబ్ధిలో మునుఁగవైవం, జక్రి వారాహగా
త్రసమేతుండయి యుద్ధరించె మును, తద్దంష్ట్రాసమాసీనయై
పొసఁగన్ భూసతి యిట్లనుం బ్రణుతివాక్పూరంబుగా శౌరికిన్.

35
  1. రత్న - మ,త,తీ,హ,ర,క
  2. మతిన్ - మా
  3. సమ్మతియే - మ,మా,త
  4. లబ్ధ - అన్ని ప్ర.
  5. ఈ వ. తీ. ప్ర. లో లుప్తము
  6. ష్ట్రాసనస్థాయినియైన భూదేవి యంబురుహనాభు (యతి?) - మ,త,క,తీ
  7. వనజనాభు (యతి?) - తా