పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

71


శా.

వేదార్థంబులు వేఱుగాఁ [1]దెలిసి, దుర్విజ్ఞాను లాత్మేశ్వరా
భేదధ్యానసమేతులై, తుదిభవత్ప్రీత్యర్థమై కర్మముల్
మోదంబొప్పఁగఁ జేయనేరక, మహామోహాంధులై యుందు రం
తాదివ్యాప్తివిహీనసంసృతిసముద్రాంతర్నిమగ్నాత్ములై.

23


సీ.

మాధవ! నీనామమంత్రామృతము జిహ్వ | కుత్తుకబంటిగాఁ గ్రోలువారుఁ,
గమలాక్ష! నీకథాగంగాంబువులఁ దోఁగి | కలుషపంకము వాయఁ గడుగువారుఁ,
బరమేశ! నీ[2]భక్తిభజననిక్షేపంబు | దొరకిన నుబ్బి మైమఱచువారు,
బలిభేది! [3]నీకుఁగా నిలఁ గర్మపృథురత్న | వితతి సంప్రీతి నర్పించువారుఁ,


తే.

త్రిదశవందిత! భవదీయపదసరోజ | సీమ నిజచిత్తభృంగంబుఁ జేర్చువారు
వరుసఁ గ్రీడింతు రానందభరితు లగుచుఁ | బుష్పసాయకజనక! నీపురవరమున.

24


సీ.

శ్రీబీజ భువనేశ్వరీబీజములు రెండు | బిందుయుక్తములుగాఁ బ్రేమ నిలిపి,
నెఱి, మహా[4]దేవాయ పరమాత్మనే వరా | [5]హాయని వేదరూపాయ యనిన,
నేకవింశాక్షరంబై కోలదేవతా | కంబగు మంత్రరాజంబు వొడము,
నిట్టి నీమంత్రంబు నింపుతోఁ బ్రణవాది | కమును, [6]స్వాహాంతంబుగా జపించి,


తే.

భక్తి నశ్వత్థసమిధా[7]జ్యపాయసములఁ | బావకుని దన్పి మంత్ర[8]తర్పణ మొనర్చి,
భూమిసురభోజనము పెట్టి పొలుచునట్టి | మానవుం డేలు, నీమహీమండలంబు.

25


క.

విను మీమంత్రంబునఁ జం | దన [9]మభిమంత్రించి ఫాలతలమునఁ దాల్పన్,
జనవనితాశతయుతభూ | ధనలాభము గలుగు, విమతదర్పము [10]నణఁగున్.

26


క.

ఏతన్మంత్రపరాయణ | తాతిశయంబున మనుష్యుఁ డైహికభోగో
పేతుఁడయి కాంచుఁ బిదప స | నాతనభవదీయపట్టణస్థితిసుఖమున్.

27


క.

అగణితబాహుపరాక్రముఁ | డగు కనకాక్షుని వధించి యఖిలజగంబున్
మగుడంగ నుద్ధరించితి | [11]వగజానుతపుణ్యనామ! యహితవిరామా!

28
  1. దలఁచి - తి,తీ
  2. భక్త - మా,త
  3. నీకుఁగప్పంబుగా నిజకర్మ పృథురత్నవితతి నర్పించువారు - మా,త,తా
  4. దేహాయ - మ,మా,త,హ,ర,క
  5. హాయయని(?) - క
  6. స్వాహాస్వధాంతమునుగాఁగభక్తి - తా
  7. ద్యుపాయనముల - తి,తీ,హ,ర,క
  8. రక్షణ (యతి?) - మ,మా,తి,తీ
  9. మునుమంత్రించి - త
  10. మహేశా - తీ; నాగున్ - తి,హ
  11. నగజాసుత (యతి?) - మా