పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

వరాహపురాణము


క.

కిరివరదంష్ట్రాదండో | పరిభాగము[1]నందు వాతపత్రముకరణిన్
ధరణీచక్రము తనరెను, | సురశైలము పసిఁడిగుబ్బచొప్పున నొప్పెన్.

14


వ.

ఇవ్విధంబున లీలాకోలదంష్ట్రాగ్రస్థానసమాసీనయగు భూదేవి యాదేవదేవుని
నిట్లని స్తుతియించె.

15


భూదేవికృతవరాహస్తుతి

శా.

శ్రీరాజన్ముఖపద్మ! దేవపటలిసేవ్యాంఘ్రివిభ్రాజితా!
దూరాపాస్తసమస్తదైత్య! సుమనోదుఃఖార్తివిచ్ఛేదనో
దారస్వాంత! జగత్త్రయైకనిలయా! దాక్షిణ్యపాథోనిధీ!
ఘోరాకారహిరణ్యలోచనహర! క్రోడావతారోజ్జ్వలా!

16


క.

హర భాస్కర శేషఫణీ | శ్వర వాణీవరుల కైన వశమే పొగడన్?
నిరుపమ నిర్మల నిశ్చల | నిరవధికము లైనయట్టి నీ[2]సుగుణములన్.

17


క.

సనకాదియోగిమానస | వనజంబులయందు, భాగవతులందు, సుధా
శనకోటియందు నుందువు, | నిను వినుతింపంగఁ దరమె నీరజనాభా!

18


క.

కొందఱు శూన్యం బనియును, | గొందఱు తేజస్స్వరూపగుణనిధి యనియున్,
గొందఱు కాలంబనియును | సందెఱుఁగక తలఁతు రుదితసందేహమునన్.

19


క.

అణువులలోఁ బరమాణువు, | ప్రణుతింప మహత్తులందుఁ బరమమహత్తై,
గణనకు నెక్కు జగత్కా | రణ[3]మగు నీ[4]పెంప యిందిరాహృదయేశా!

20


చ.

నతమతి నీగుణస్తుతి యొనర్చిన యాశ్వపచుండు సర్వపూ
జితుఁ డగుఁ, దావకాంఘ్రిసరసీరుహభక్తివిహీనుఁడై చతుః
శ్రుతిపఠనంబు చేసిన [5]విశుద్ధకులోద్భవుఁడైన నంత్యజ
ప్రతిముఁ డగున్, జగత్త్రితయపావనకీర్తన! పుణ్య[6]వర్తనా!

21


క.

అకృతప్రయత్నుఁడై తను | వికృతిం బ్రాపించునపుడు 'విష్ణో!' యనుచున్
సకృ[7]దుచ్చరణము చేసినఁ | బ్రకృతిగుణవిరహితుఁ డగును బతితుం డైనన్.

22
  1. నంటి - తి,తీ,హ,ర,క
  2. నామములన్ - త
  3. మునుదీపింపదిందిరా - తీ
  4. పెంపుయిందిరా - తీ. కంటె భిన్న ప్ర.
  5. విశిష్ట (యతి?) - తీ
  6. కీర్తనా - మ,మా,త, తా, తి తీ,హ,ర
  7. దుత్స్మరణ - తి తీ,హ,ర