పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

69


చ.

ఘన[1]తరఘోషవేగమగు గర్జిత మూర్జితభంగి నింగి దా
ర్కొనఁ గొనగొల్పి, తాపమును గోపము నొక్కట ముంపుచుండ మీఁ
దను దనుజేంద్రుపైఁ జనిన తత్క్షణ మాక్షణదాచరుండు నిం
పునఁ బునరస్త్రవర్షమున ముంచె సుదంచితలీలఁ [2]గోలమున్.

7


క.

వాలమ్మున నాదైత్యుని | వా లమ్ములు దాఁకకుండ వడిఁ జదియుచు నా
కోలమ్ము [3]గవిసె జితకా | కోలమ్మగు రోషవహ్ని గొబ్బున నిగుడన్.

8


చ.

కవిసినఁ, [4]గ్రేళ్ళు దాఁటి మదిఁ గంపము లే కసురేంద్రుఁ డంబికా
ధవవరలబ్ధమైన నిశితంబగు శూలము వైవఁ, దత్కిటి
ప్రవరుని చెక్కు నాటి, కనుపట్టె నిశాచరరాడ్వధార్థమై
చెవికడఁ [5]జేరి, మంతనము చెప్పఁగ నిల్చినభాతి నందమై.

9


వ.

ఇట్లు నక్తంచరప్రయుక్తంబై, నిజకపోలపాలికాసక్తంబైన యాభీలంబగు శూలంబు
నేలంబడ విదిర్చి, కోపాటోపంబున,

10


హిరణ్యాక్షసంహారము

ఉ.

ఆదివరాహ మప్పు డమరాహితుఁ గూలఁగఁ దూఁటి, తీక్షదం
ష్ట్రాదళితాంగుఁ జేసి, నవరక్తకదుష్ణతదాంత్రమాలికా
చ్ఛేదము లంబరమ్మునకుఁ జిమ్ముచుఁ గ్రీడ యొనర్చె, రాక్షసుల్
మోదవిహీనభావమున ముందఱగానక తల్లడిల్లఁగన్.

11


వరాహమూర్తి వసుంధరను దంష్ట్రాగ్రమున నుద్ధరించుట

చ.

దురమున లోకకంటకుని దుర్మదు నిట్లు వధించి, యామినీ
చరనివహంబునెల్ల యమసద్మముఁ జేరఁగఁ [6]బంచి, మేరుభూ
ధరపురదేశకాననవితానధురంధరయైన యావసుం
ధర నురుదంష్ట్రికాగ్రమునఁ దాల్చి, పయోనిధిమీఁది కెత్తినన్.

12


క.

విమలంబై తద్దంష్ట్రా | గ్రమునన్, భూదేవి మృత్తికాతనుఖండ
క్రమమునఁ జాలఁగ నొప్పెను | సుమనస్సంఘంబు లెల్లఁ జోద్యంబందన్.

13
  1. ఘనరోషవేష - మ,మా
  2. గ్రోడ - క
  3. గదిసె - మ,త,తా,తి,తీ,హ,ర,క
  4. గెల్లుదాటి - అన్ని ప్ర.
  5. నిల్చి - ర
  6. బుచ్చి - ర